T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో ఐర్లాండ్ విధ్వంసం.. 'వరల్డ్ కప్' చరిత్రలో మరో రికార్డు స్కోరు

by Malleboina Mahesh |   (  Updated:2026-02-14 08:11:55  IST  )

కొలంబో వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ మ్యాచులో ఐర్లాండ్ జట్టు విధ్వంసం సృష్టించింది. ఓమన్ తో జరిగిన ఈ మ్యాచులో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. దీంతో ఈ స్కోర్ టీ20 ప్రపంచ కప్ చరిత్రలో 2వ అత్యధిక స్కోరుగా రికార్డుల్లోకి ఎక్కింది.

T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో ఐర్లాండ్ విధ్వంసం.. వరల్డ్ కప్ చరిత్రలో మరో రికార్డు స్కోరు
X

దిశ, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో ఐర్లాండ్ జట్టు విద్వంసం సృష్టించింది. గ్రూప్ స్టేజ్ లో భాగంగా శనివారం ఉదయం ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ బ్యాటర్లు రెచ్చిపోయారు. శ్రీలంకలోని కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించారు. కేవలం 51 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఒకానొక దశలో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో ఉన్న జట్టును టక్కర్ తన అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకోవడమే కాకుండా, ప్రత్యర్థి జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు.

ఈ మ్యాచ్ ప్రారంభంలో ఐర్లాండ్ బ్యాటర్లు తడబడినప్పటికీ, టక్కర్‌కు తోడుగా గారెత్ డెలానీ (56) మెరుపు అర్థసెంచరీతో రాణించారు. దీంతో వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు వేగంగా పరుగులు జోడించడంతో ఐర్లాండ్ పటిష్ట స్థితికి చేరుకుంది. ఆఖరి ఓవర్లలో జార్జ్ డాక్రెల్ (35 నాటౌట్) కేవలం 9 బంతుల్లోనే 5 సిక్సర్లతో విరుచుకుపడటంతో ఐర్లాండ్ స్కోరు 230 దాటింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఐర్లాండ్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. కాగా మొత్తం టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే ఇదే రెండవ అత్యధిక స్కోరుగా రికార్డుల్లో నిలిచింది. 260 పరుగులతో శ్రీలంక మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచులో ఒమన్ జట్టు విజయం సాధించాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 236 పరుగులు చేయాల్సి ఉంది.

Next Story