అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. గల్ఫ్ రీజియన్‌లో టెక్ వార్

by Malleboina Mahesh |

బహ్రెయిన్ అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి! టెక్ కంపెనీలకు ఇరాన్ వార్నింగ్. ఇరాన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్ ఖతమన్న ట్రంప్. 4% పెరిగిన చమురు ధరలు.

అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. గల్ఫ్ రీజియన్‌లో టెక్ వార్
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ vs అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాల వైపు మళ్ళింది. బహ్రెయిన్‌లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సెంటర్‌పై ఇరాన్ విప్లవాత్మక గస్తీ దళం (IRGC) బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో డేటా సెంటర్‌లోని సర్వర్లు తీవ్రంగా దెబ్బతినడంతో గల్ఫ్ ప్రాంత వ్యాప్తంగా క్లౌడ్ సేవలకు భారీ అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ యొక్క నిఘా, సైనిక కార్యకలాపాలకు ఈ డేటా సెంటర్లు సహకరిస్తున్నాయనే నెపంతో ఇరాన్ ఈ దాడులకు పాల్పడినట్టు సమాచారం.

కేవలం అమెజాన్ మాత్రమే కాకుండా, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, మెటా వంటి 18 అమెరికన్ సాఫ్ట్‌వేర్ దిగ్గజాలను "టెర్రరిస్ట్ సంస్థలు"గా ఇరాన్ ప్రకటించింది. తమ దేశంపై జరుగుతున్న దాడులకు ప్రతీకారంగా ఈ కంపెనీల ప్రాంతీయ కార్యాలయాలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని, అక్కడి ఉద్యోగులు వెంటనే ప్రాణాలు కాపాడుకోవడానికి బయటకు రావాలని ఇరాన్ హెచ్చరించడం సంచలనం సృష్టించింది.

మరోవైపు, ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినంగా స్పందించారు. బుధవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, ఇరాన్ యొక్క సైనిక శక్తి ఇప్పటికే నామరూపాల్లేకుండా పోయిందని ప్రకటించారు. "ఇరాన్ నౌకాదళం సముద్ర గర్భంలో ఉంది, వారి వైమానిక దళం శిథిలావస్థకు చేరింది. వారి అగ్ర నాయకత్వం అంతమైంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ తన వ్యూహాత్మక సామర్థ్యాన్ని తిరిగి పొందడానికి 15 నుంచి 20 ఏళ్లు పడుతుందని, ప్రస్తుతం ఆ దేశం ఒక పనికిరాని సైనిక వ్యవస్థగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. అమెరికన్ వాణిజ్య సంస్థలపై దాడులు చేయడం ద్వారా ఇరాన్ తన వినాశనాన్ని తానే కొనితెచ్చుకుంటోందని ట్రంప్ హెచ్చరించారు.

రాబోయే రెండు నుండి మూడు వారాల్లో ఇరాన్‌పై మరింత తీవ్రమైన దాడులు ఉంటాయని, ఈ యుద్ధం క్లైమాక్స్‌కు చేరుకుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ వద్ద ఉన్న క్షిపణి తయారీ కేంద్రాలు, రాకెట్ లాంచర్లను ఇప్పటికే ధ్వంసం చేశామని, వారు ఇకపై అమెరికా ప్రయోజనాలకు ముప్పు కలిగించలేరని ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ టెక్ కంపెనీలు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయడమో, వేరే ప్రాంతాలకు తరలించడమో చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు 4 శాతం మేర పెరిగి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ నీడలు కమ్ముకున్నాయి.

Next Story