అమెరికా మిలటరీ స్థావరాలపై ఇరాన్‌ మిసైల్స్ దాడి

by Muthe.Rajitha |

అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైన్యం గురువారం జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై భారీ ఎత్తున క్షిపణుల వర్షం కురిపించింది.

అమెరికా మిలటరీ స్థావరాలపై ఇరాన్‌ మిసైల్స్ దాడి
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా (Middle East) లో ఉద్రిక్తతలు మరోసారి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ (Strait of Hormuz) జలసంధిలో వాణిజ్య నౌకలను ఇరాన్ అడ్డగించడం, దానికి ప్రతిచర్యగా అమెరికా వైమానిక దాడులకు దిగడంతో ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైన్యం గురువారం జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై భారీ ఎత్తున క్షిపణుల వర్షం కురిపించింది. జోర్డాన్ భూభాగంలో ఉన్న అమెరికా మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని తాము 10 అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు IRGC అధికారికంగా ప్రకటించింది. ఈ దాడుల్లో జోర్డాన్‌లోని అమెరికా ప్రధాన సైనిక కమాండ్ కంట్రోల్ సెంటర్ పూర్తిగా నాశనం కాగా, ఒక కీలక వైమానిక స్థావరం (Air Base) తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఇరాన్ పేర్కొంది. "అమెరికా గనుక తన దూకుడును ఇలాగే కొనసాగిస్తే... పశ్చిమాసియా అంతటా ఉన్న ఆ దేశ సైనిక స్థావరాలలో ఏ ఒక్కటి కూడా సురక్షితంగా ఉండదు. మాపై జరిగే ప్రతి దాడికి అంతకంతకూ ప్రతిదాడి తప్పదు" అని ఇరాన్ సైనిక నాయకత్వం స్పష్టం చేసింది.

పెరగనున్న ముడి చమురు ధరలు

హర్మూజ్ జలసంధి వేదికగా మొదలైన ఈ ఘర్షణ.. ఇప్పుడు జోర్డాన్ వంటి సరిహద్దు దేశాలకు విస్తరించడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. అమెరికా తన కమాండ్ సెంటర్‌పై జరిగిన ఈ భారీ దాడిని ఎలా ఎదుర్కొంటుంది? ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగుతుంది? అనే అంశంపైనే పశ్చిమాసియా భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరలు ఒక్కసారిగా భగ్గుమనే ప్రమాదం కనిపిస్తోంది.

Next Story