మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు.. ఏక్‌నాథ్ షిండేతో శరద్ పవార్ భేటీ..

by I. Sairam |

ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేతో భేటీ అయ్యారు. ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఊహాగానాలకు దారి తీసింది.

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు.. ఏక్‌నాథ్ షిండేతో శరద్ పవార్ భేటీ..
X

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తీసుకునేలా కనిపిస్తున్నాయి. తరచుగా ఎన్డీఏ కూటమిని విమర్శించే ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అకస్మాత్తుగా ఆ కూటమిలో భాగస్వామిగా ఉన్న శివసేన (షిండే వర్గం) చీఫ్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేతో సమావేశం అయ్యారు. ఈ ఆకస్మిక భేటీ తీవ్ర సంచలనంగా మారింది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో ఆందోళన కలిగించింది. ఈ సమావేశంపై ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

సరిహద్దు వివాదం సమావేశానికి వచ్చి..

మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన నిర్వహించిన కీలకమైన సమావేశానికి హాజరయ్యేందుకు శరద్ పవార్ మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత నేరుగా షిండే ఛాంబర్‌కు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న షిండే, అప్పటికే జరుగుతున్న కేబినెట్ సమావేశాన్ని కాసేపు నిలిపివేసి వచ్చారు. పవార్‌కు శాలువా, ఫ్లవర్ బొకేతో స్వాగతం పలికారు. వీరిద్దరూ సుమారు 15 నిమిషాల పాటు విడిగా చర్చలు జరిపారు. తర్వాత షిండే వెళ్లిపోయారు. కానీ ఇక్కడే అసలు కథ మలుపు తిరిగింది. షిండే ఆఫీసు నుంచి వెళ్లిన తర్వాత కూడా పవార్ అక్కడే ఉండిపోయారు. ఆ ఛాంబర్‌లోనే తన పార్టీ ఎమ్మెల్యేలతో ఓ సమావేశాన్ని నిర్వహించడం సంచలనంగా మారింది. ఇందులో ఏం చర్చించారనేది బయటకు రాలేదు. అయితే ఇది ఒక మర్యాదపూర్వక సమావేశంగా అని షిండే ఆఫీసు అభివర్ణించింది. కానీ ఈ పరిణామం మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఊహాగానాలకు తావిచ్చింది.

ఇది ద్రోహులను గౌరవించడమే : రౌత్

ఈ భేటీపై శివసేన (యూబీటీ) కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. శరద్ పవార్ ఎంతో గొప్ప నాయకుడు అని, అయితే ఎంవీఏ ప్రభుత్వాన్ని కూల్చేసిన ఒక ద్రోహితో ఇలాంటి సమావేశాలు నిర్వహించడం వల్ల ఆయన ప్రతిష్ట తగ్గుతుందని విమర్శించారు. ఇది ద్రోహులను గౌరవించడమే అవుతుందని దుయ్యబట్టారు. ఈ భేటీ ఉద్దవ్ వర్గాన్ని తీవ్రంగా బాధించిందని, మహారాష్ట్రలో అవినీతి పెరగడానికి షిండేనే కారణమని ఆరోపించారు. శరత్ పవార్ సమావేశం కోసం అసెంబ్లీలో వేరే స్థలాలేవీ ఖాళీగా లేవా అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యల వల్ల ఎన్‌సీపీ (ఎస్పీ) విశ్వసనీయత దెబ్బతింటుందని అన్నారు. శరద్ పవార్‌కు అజిత్ పవార్ చేసిన ద్రోహాన్ని మనస్సులో ఉంచుకుని తామైతే అజిత్ పవార్ ఆఫీసులో ఎప్పుడూ సమావేశాలు నిర్వహించబోమని చెప్పారు. ఎంవీఏ కూటమిలోని పార్టీలన్నీ ఈ నియమాన్ని పాటించాలని అన్నారు. అయితే పవార్ ఎన్‌డీఏ కూటమితో చేతులు కలపరనే నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు.

కూటమి పునాదులు అంత బలహీనమా : అమోల్

రౌత్ వ్యాఖ్యలపై ఎన్‌సీపీ (ఎస్పీ) ప్రతినిధి అమోల్ మాతేలే ఘాటుగా స్పందించారు. రౌత్‌వి ద్వంద్వ నీతులు అని విమర్శించారు. గతంలో శరద్ పవార్ ఉద్ధవ్ ఠాక్రేను కలిసినప్పుడు రాజకీయ చాణక్యం అని అభివర్ణించిన ఆయన.. ఇప్పుడు షిండేను కలిస్తే ఎందుకు తప్పుబడుతున్నారని ప్రశ్నించారు. రాజకీయాలు భావోద్వేగాలపై నడవవని, లెక్కలపై నడుస్తాయని తెలిపారు. కేవలం ఒకే ఒక్క భేటీకే విపక్ష కూటమి కదిలిపోతే దాని పునాదులు ఎంత బలహీనంగా ఉన్నాయో తెలుస్తోందని అన్నారు. ఈ పరిణామంపై ఎన్సీపీ (ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు శశికాంత్ షిండే స్పందిస్తూ.. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని తెలిపారు. తమ పార్టీ ఎన్‌డీఏలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Next Story