- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుబాయ్‌లోని ప్రఖ్యాత "పామ్ జుమ్మెరా"పై ఇరాన్ దాడి
దుబాయ్ లోని పలు కీలక ప్రాంతాలపై ఇరాన్ మిసైల్ దాడులకు దిగింది. అందులో ప్రఖ్యాత పామ్ జుమ్మెరాపై కూడా ఈ దాడులు జరిగినట్టు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. క్షిపణి, డ్రోన్ బలగాలతో యూఏఈ (UAE) లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా దాడులు జరిపింది. శనివారం నాడు ప్రపంచ ప్రఖ్యాత మానవ నిర్మిత ద్వీపం పామ్ జుమ్మెరాపై మిసైల్స్ తో దాడికి తెగబడింది. ఈ దాడి కేవలం పామ్ జుమ్మెరాకే పరిమితం కాకుండా, అబుదాబి. దుబాయ్‌లోని ఇతర ముఖ్యమైన ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడిలో పామ్ జుమ్మెరాలోని కొన్ని విలాసవంతమైన హోటళ్లు, నివాస సముదాయాలల్లో దట్టమైన పొగ, భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. అయితే యూఏఈ యొక్క అత్యున్నత క్షిపణి రక్షణ వ్యవస్థలైన 'థాడ్' (THAAD), 'పేట్రియాట్' (Patriot)లు ఇరాన్ ప్రయోగించిన అనేక బాలిస్టిక్ క్షిపణులను గగనతలంలోనే అడ్డుకున్నాయి. కాగా కూల్చివేసిన క్షిపణుల శకలాలు అత్యంత వేగంతో పామ్ జుమ్మెరా వంటి నివాస ప్రాంతాలపై పడటంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఒక పాకిస్తానీ పౌరుడు మరణించగా సుమారు నలుగురు వ్యక్తులు గాయపడ్డారని, వారిని వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారని దుబాయ్ మీడియా ఆఫీస్ ధృవీకరించింది.
ఈ దాడుల ప్రభావం దుబాయ్ పర్యాటక రంగాలపై తీవ్రంగా పడనుంది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాను తాత్కాలికంగా ఖాళీ చేయించారు. అలాగే, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (DXB) ను మూసివేసి, వందలాది విమాన సర్వీసులను రద్దు చేశారు. దుబాయ్‌లో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులు ఈ పరిణామాలతో ఆందోళనకు గురవుతున్నారు. భారత రాయబార కార్యాలయం ఇప్పటికే అప్రమత్తమై, భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి యూఏఈ ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అలాగే ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని కోరుతోంది.






