ఉప్పల్‌లో ఐపీఎల్ ‘బ్లాక్’ దందా.. స్టేడియం వద్ద నలుగురు కేటుగాళ్ల అరెస్ట్

by Malleboina Mahesh |   (  Updated:2026-05-22 10:21:27  IST  )

ఉప్పల్ స్టేడియం వద్ద ఐపీఎల్ కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న నలుగురు కేటుగాళ్లను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉప్పల్‌లో ఐపీఎల్ ‘బ్లాక్’ దందా.. స్టేడియం వద్ద నలుగురు కేటుగాళ్ల అరెస్ట్
X

దిశ, ఉప్పల్: ఐపీఎల్ 2026 లో భాగంగా ఈ రోజు 67వ మ్యాచ్ SRH vs RCB జట్ల మధ్య జరగనుంది. హైదరాబాద్‌ లోని ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) వేదికగా జరగనున్న చివరి మ్యాచ్ కావడం, భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వస్తుండటంతో ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి చూస్తున్నారు. ఈ క్రమంలో క్రికెట్ అభిమానుల్లో ఉన్న ఆశను నిరాశ కలిగిస్తూ భారీ బ్లాక్ టికెట్ల దందా (Black ticket scam) వెలుగులోకి వచ్చింది. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలనుకునే సామాన్య అభిమానులకు టికెట్లు దొరకడమే గగనంగా మారిన తరుణంలో.. కొందరు కేటుగాళ్లు ఉచితంగా వచ్చే కాంప్లిమెంటరీ (Complementary) టికెట్లను సైతం పక్కదారి పట్టించి బ్లాక్‌లో విక్రయిస్తూ పోలీసులకు చిక్కారు.

సెలబ్రిటీలు, అధికారులు, వివిఐపిలకు ఉచితంగా కేటాయించే అత్యంత విలువైన కాంప్లిమెంటరీ టికెట్లు బహిరంగంగా బ్లాక్ మార్కెట్లోకి రావడం కలకలం రేపింది. సాధారణ టికెట్లతో పాటు ఈ ఉచిత పాసులను కూడా అక్రమార్కులు సామాన్య అభిమానులకు భారీ ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో రహస్యంగా నిఘా పెట్టిన రాచకొండ టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు.. బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్న నలుగురు నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న అక్రమ టికెట్లను, నగదును, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నలుగురు నిందితులను SOT అధికారులకు అప్పగించారు.

టికెట్లు ఎలా వచ్చాయని విచారణ

ఈ కాంప్లిమెంటరీ టికెట్లు నిందితుల వద్దకు ఎలా వచ్చాయి..? వీటి వెనుక ఇంకెవరైనా ఉన్నారా..? ఈ బ్లాక్ టికెట్ల దందా ఎప్పటి నుంచి కొనసాగుతోంది..? అనే కోణాల్లో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. మ్యాచ్‌ల సమయంలో అభిమానుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ముఠాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు.

Next Story