తెలంగాణ పల్లెల్లో ఇంటర్నెట్ విప్లవం.. టీ-ఫైబర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

by Malleboina Mahesh |

టీ-ఫైబర్‌కు కేంద్రం ₹3,185 కోట్ల బూస్ట్! తెలంగాణలోని మరో 3,089 గ్రామాలకు చేరనున్న ఇంటర్నెట్. త్వరలోనే ఉమ్మడి కరీంనగర్‌లో సేవలు ప్రారంభం.

తెలంగాణ పల్లెల్లో ఇంటర్నెట్ విప్లవం.. టీ-ఫైబర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలని టీ-ఫైబర్ సంకల్పించింది. ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగానూ ఇప్పటికే కేబుల్‌ను అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా టీ-ఫైబర్ అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధం అవుతుంది. అయితే.. కేంద్రం నుంచి టీ-ఫైబర్‌కు ఓ గుడ్‌న్యూస్ వచ్చింది. వేగవంతమైన ఇంటర్నెట్ సేవలందించేందుకు టీ-ఫైబర్ చేస్తున్న ప్రయత్నానికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చింది. భారత ప్రభుత్వం సవరించిన భారత్‌నెట్ ప్రోగ్రాం (ఏబీపీ) కింద తెలంగాణకు రూ.3,185 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.

ఈ నిధులతో భారత్‌నెట్ ఫేజ్-1, ఫేజ్-2 పనులను అప్‌గ్రేడ్ చేయడంతోపాటు ఫేజ్-3 విస్తరణ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు అమలుకు కేంద్రం, రాష్ట్రం మధ్య ఒప్పందం కుదుర్చు కోవాల్సి ఉన్నది. మరికొద్ది రోజుల్లో కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చి దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించనున్నట్లు తెలిసింది. దాంతో ఓ రూట్ మ్యాప్ రూపొందించి.. ఆ తర్వాత కేంద్రం వాటా, రాష్ట్ర వాటాను విభజించి ఒప్పందం చేసుకోనున్నారు. ఆ తదుపరి వెంటనే ఎంవోయూలు కుదుర్చుకోనున్నారు. ఆ తర్వాత కేంద్రం వాటాతో రాష్ట్రం ముందుకెళ్లనుంది.

ఆ జిల్లాల్లోనూ అమలు..

టీ-ఫైబర్ సేవలను ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని 3,089 గ్రామాలకూ విస్తరించనున్నారు. ప్రస్తుతం టీ-ఫైబర్ ద్వారా తెలంగాణలో 9,662 గ్రామాలకు సేవలు అందించే సామర్థ్యం ఉన్నది. కొత్త గ్రామాలు చేరడంతో రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి హైస్పీడ్ ఇంటర్నెట్ అందించే దిశగా తెలంగాణ మరో అడుగు ముందుకేస్తుంది. మొత్తం రూ.3,185 కోట్లలో రూ.2,697 కోట్లు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ కేబుల్ పనులు, నిర్వహణ కోసం వినియోగించనున్నారు.

మరో రూ.432 కోట్లు ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కేబుల్ మౌలిక వసతుల బలోపేతానికి కేటాయించనున్నారు. భారత్‌నెట్ ఫేజ్-2లో ఇప్పటికే టీ-ఫైబర్ ద్వారా సుమారు 42 వేల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ 9,662 గ్రామాల్లో వేశారు. వీటిలో 8,835 గ్రామాల్లో సేవలు ప్రారంభించేందుకు సాంకేతికంగా సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అవసరమైన ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే సేవలు ప్రారంభం కానున్నాయి.

జనాభా ఆధారంగా కనెక్షన్ కాస్ట్..

గ్రామ జనాభా ఆధారంగా ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఖర్చును కూడా నిర్ణయించారు. 3,000 మందికి పైగా జనాభా ఉన్న గ్రామాల్లో ఒక కనెక్షన్‌కు రూ.8,900, 2,000–3,000 మధ్య జనాభా ఉన్న గ్రామాల్లో రూ.10,500, 1,000-2,000 మధ్య జనాభా ఉన్న గ్రామాల్లో రూ.11,500, 1,000 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో రూ.12,900గా నిర్ణయించారు. ఈ ఆమోదం రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాల ఫలితంగా లభించింది. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసుకుంది. మంత్రి శ్రీధర్‌బాబు కేంద్రంతో చర్చలు జరిపి ప్రాజెక్టు ఆమోదం కోసం కృషి చేశారు. ఈ క్రమంలో కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సమావేశమై టీ-ఫైబర్ విస్తరణకు సహకారం కోరారు. ఈ ప్రాజెక్టు అమలుతో గ్రామాల్లో డిజిటల్ సేవలు, ఆన్‌లైన్ విద్య, టెలీమెడిసిన్, ఈ-గవర్నెన్స్ మరియు గ్రామీణ వ్యాపార అవకాశాలు వేగంగా అభివృద్ధి చెందనున్నాయి.

ఉమ్మడి కరీంనగర్‌లో ప్రారంభం..?

ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు గ్రామాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా టీ-ఫైబర్ సేవలందిస్తోంది. అయితే.. కేంద్రంతో ఒప్పందం తర్వాత మొదటగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పూర్తి స్థాయిలో సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. లేదంటే ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో అమలు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే.. ఆ రెండు జిల్లాల్లో పోల్చితే కరీంనగర్‌లోనే సోర్స్ ఎక్కువ అనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తం అయినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఇక్కడే ముందుగా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

Next Story