బెజవాడ యువకుడికి అంతర్జాతీయ పురస్కారం

by Muthe.Rajitha |

విజయవాడకు చెందిన యువకుడు తరుణ్ చెరుకూరి, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'స్కోల్ అవార్డు ఫర్ సోషల్ ఇన్నోవేషన్' కు ఎంపికయ్యారు.

బెజవాడ యువకుడికి అంతర్జాతీయ పురస్కారం
X

దిశ, వెబ్ డెస్క్ : విజయవాడకు చెందిన యువకుడు తరుణ్ చెరుకూరి, అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'స్కోల్ అవార్డు ఫర్ సోషల్ ఇన్నోవేషన్'(Skoll Award for Social Innovation) కు ఎంపికయ్యారు. వినూత్న పద్ధతులను ఉపయోగించి సమాజంలోని అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ సేవలను చేరువ చేస్తున్నందుకు గాను ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని స్కోల్ ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు సంస్థలను మాత్రమే ఈ పురస్కారానికి ఎంపిక చేయగా, అందులో తరుణ్ స్థాపించిన 'ఇండస్ యాక్షన్' (Indus Action) చోటు సంపాదించుకోవడం విశేషం. ఈ అవార్డు కింద సదరు సంస్థకు 2 మిలియన్ డాలర్లు అనగా సుమారు రూ.18.5 కోట్లకు పైగా భారీ నగదు బహుమతిని అందజేస్తారు.

తరుణ్ చెరుకూరి ఢిల్లీ, బెంగళూరు కేంద్రాలుగా 'ఇండస్ యాక్షన్' సంస్థను స్థాపించి, విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రత వంటి కీలక రంగాల్లో పౌరులకు లభించాల్సిన హక్కులను పారదర్శకంగా అందేలా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా 2030 నాటికి భారతదేశంలో 3 కోట్ల మంది అర్హులైన పౌరులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని ప్రభుత్వ ప్రయోజనాలను చేరవేయడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా సాంకేతికతను ఒక వారధిగా ఉపయోగిస్తూ ఆయన చేస్తున్న ఈ సేవలు అంతర్జాతీయ వేదికపై గుర్తింపు పొందడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం.

Next Story