ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-02 07:50:04  IST  )

ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో చోటుచేసుకుంది.

ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ,కొత్తగూడ: కుటుంబ కలహాలు, చదువు ఒత్తిడితో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన పెండ్లి చందన(17) (ఇంటర్ ప్రథమ సంవత్సరం) గురువారం తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటన స్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్‌ను పరిశీలించగా, కుటుంబ కలహాలు, చదువు ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నట్లు ఎస్సై తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు.

క్షణికావేశం జీవితాలను చీకటి చేస్తుంది:ఎస్సై రాజ్ కుమార్

చదువులో ఒత్తిడి, కుటుంబ సమస్యలు లేదా ఇతర వ్యక్తిగత ఇబ్బందులు ఎదురైనప్పుడు విద్యార్థులు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని ఎస్సై రాజ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బంధువులు లేదా నమ్మకమైన వ్యక్తులతో పంచుకుని పరిష్కారం వెతుక్కోవాలని ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందని, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలకు జీవితాంతం తీరని విషాదాన్ని మిగులుస్తాయని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ, వారితో ఆప్యాయంగా మాట్లాడి, ప్రేమతో అండగా నిలిచి ధైర్యం చెప్పాలని ఎస్సై రాజ్‌కుమార్ కోరారు.

Next Story