- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ పత్తి విత్తనాల అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు..
యాదాద్రి భువనగిరి జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణా పై తుర్కపల్లి పోలీసులు భారీ దాడి నిర్వహించి అంతర్రాష్ట్ర ముఠాను ఛేదించారు.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణా పై తుర్కపల్లి పోలీసులు భారీ దాడి నిర్వహించి అంతర్రాష్ట్ర ముఠాను ఛేదించారు. ఈ దాడిలో రూ.10 లక్షల విలువైన 150 కిలోల నకిలీ బీజీ-II పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని ఒక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు యాదాద్రి డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు తెలిపారు. మంగళవారం తుర్కపల్లి పోలీస్ స్టేషన్‌లో యాదగిరిగుట్ట రూరల్ సీఐ శంకర్ గౌడ్, తుర్కపల్లి ఎస్సై ఎం.డి. తకియుద్దీన్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు.
డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన దొండపాటి మల్లికార్జునరావు నిషేధిత బీజీ-II పత్తి విత్తనాలను గుంటూరు నుంచి సిద్ధిపేటకు అక్రమంగా తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తుర్కపల్లి బస్ స్టాండ్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, చిత్తూరు జిల్లాకు చెందిన శంకర్‌తో కలిసి తెలంగాణలో నకిలీ పత్తి విత్తనాల విక్రయానికి కుట్ర పన్నినట్లు వెల్లడైందన్నారు. రైతులకు అధిక దిగుబడి వస్తుందని, నాణ్యమైన పంట దిగుతుందని తప్పుడు ప్రచారం చేస్తూ నకిలీ విత్తనాలను విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడని తెలిపారు.
అతడి వద్ద నుంచి "బిల్లా బీజీ-II 999" పేరుతో ఉన్న 70 కిలోల నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు, మరో 80 కిలోల కల్తీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. విత్తనాల నిల్వ, రవాణా, విక్రయాలకు సంబంధించిన ఎలాంటి చెల్లుబాటు అయ్యే లైసెన్సులు, బిల్లులు, ఇన్‌వాయిస్‌లు లేదా అధికారిక పత్రాలను నిందితుడు సమర్పించలేకపోయాడని పేర్కొన్నారు. పరారీలో ఉన్న రెండో నిందితుడు శంకర్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
రైతులు అప్రమత్తంగా ఉండాలి...
నకిలీ విత్తనాల వినియోగం వల్ల మొలక శాతం తగ్గిపోవడం, పంటలు విఫలమవడం, రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు హెచ్చరించారు. రైతులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని, అనుమానాస్పద విత్తనాల విక్రయాలపై వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.






