సోలార్ రంగంలో చైనా గుత్తాధిపత్యానికి చెక్.. కేంద్రం కీలక నిర్ణయం!

by Thanuru Gopichand |

భారతదేశంలో సోలార్ (సౌరశక్తి) రంగాన్ని పూర్తి స్వావలంబన వైపు నడిపించేందుకు, విదేశీ దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మక అడుగు వేసింది.

సోలార్ రంగంలో చైనా గుత్తాధిపత్యానికి చెక్.. కేంద్రం కీలక నిర్ణయం!
X

దిశ‌, నేష‌న‌ల్ బ్యూరో: భారతదేశంలో సోలార్ (సౌరశక్తి) రంగాన్ని పూర్తి స్వావలంబన వైపు నడిపించేందుకు, విదేశీ దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మక అడుగు వేసింది. గ్లోబల్ సోలార్ సప్లై చైన్‌లో చైనాకు ఉన్న తిరుగులేని గుత్తాధిపత్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా, కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎమ్ఎన్ఆర్ఈ) తన సరికొత్త 'అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్స (ఏఎల్ఎమ్ఎమ్‌) నిబంధనలను పొడిగించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్యానెల్ ఉత్పత్తిలో దాదాపు 80 శాతానికి పైగా చైనా నియంత్రణలోనే ఉంది. అంతేకాకుండా ప్యానెళ్ల తయారీకి వాడే వేఫర్స్ విభాగంలో చైనాకు ఏకంగా 95 శాతానికి పైగా వాటా ఉంది. ఈ భారీ డిపెండెన్సీని, చైనాకున్న వ్యూహాత్మక పట్టును బద్దలు కొట్టడానికి, సోలార్ తయారీ విలువ గొలుసులో అత్యంత కీలకమైన సోలార్ ఇంగోట్స్ (లోహపు దిమ్మలు), వేఫర్స్ (పలకలు)లను కూడా కేంద్రం ఈ ఆమోదిత జాబితా పరిధిలోకి తీసుకువచ్చింది. ఇప్పటివరకు కేవలం దిగుమతి చేసుకున్న విడిభాగాలతో ప్యానెళ్లను అసెంబ్లింగ్ చేసే స్థాయి నుండి, దేశీయంగానే గ్రౌండ్ లెవెల్ నుండి ముడిసరుకును ఉత్పత్తి చేసేలా పరిశ్రమలను సిద్ధం చేయడం ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం.

జూన్ 1, 2028 నుంచి సరికొత్త పాలసీ

కేంద్రం ప్రకటించిన ఈ నూతన ఏఎల్ఎమ్ఎమ్‌-3 పాలసీ జూన్ 1, 2028 నుండి దేశవ్యాప్తంగా అధికారికంగా అమలులోకి రానుంది. ఈ గడువు ముగిసిన తర్వాత దేశంలో చేపట్టే నెట్-మీటరింగ్, ఓపెన్-యాక్సెస్ ప్రాజెక్టులతో సహా అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ సోలార్ ప్రాజెక్టులలో తప్పనిసరిగా దేశీయంగా తయారైన, ప్రభుత్వ గుర్తింపు పొందిన వేఫర్లను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ కఠినమైన నిబంధన వల్ల రాబోయే మూడేళ్లలో భారత సోలార్ రంగంలోకి దాదాపు రూ. 50,000 కోట్ల వరకు కొత్త పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తద్వారా దేశీయంగానే 80 జీడ‌బ్ల్యూ వరకు వేఫర్, ఇంగోట్ తయారీ సామర్థ్యం ఏర్పడి, స్థానిక అవసరాలకు పూర్తి భద్రత లభిస్తుంది. ప్రారంభంలో చైనా ఉత్పత్తులతో పోలిస్తే దేశీయంగా తయారయ్యే వేఫర్ల ఖర్చు కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ, లాంగ్ రన్‌లో భారత ఇంధన భద్రతకు, 2030 నాటికి 500 జీడ‌బ్ల్యూ శిలాజ రహిత విద్యుత్ సామర్థ్యాన్ని అందుకోవాలనే దేశ ప్రతిష్టాత్మక లక్ష్యానికి ఈ 'ఆత్మనిర్భర్' పాలసీ ఒక గేమ్ ఛేంజర్‌గా మారనుంది.

Next Story