- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్ రిజల్ట్స్ ఎఫెక్ట్.. మూడు రోజుల్లో 13 మంది బలవన్మరణం!
రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు! మూడు రోజుల్లో 13 మంది మృతి. ప్రాణాలు తీసుకోవద్దని నిపుణుల విజ్ఞప్తి.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విద్యార్థుల ఆత్మహత్యల (Student suicides)కు కారణం అవుతున్నాయి. ఈ ఫలితాలు విడుదలైన నాటి నుంచి రాష్ట్రంలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని మనస్తాపంతో గత మూడు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా సంగారెడ్డి జిల్లాకు చెందిన రమేష్, నందిని, నిర్మల్ జిల్లాకు చెందిన మణివర్ధన్, భూక్యా ఆకాష్, సిద్దిపేట జిల్లాకు చెందిన పొట్ల ప్రత్యూషలు తమ ప్రాణాలను తీసుకున్నారు. చదువులో వెనుకబడ్డామన్న భయం, సమాజానికి ముఖం చూపలేమన్న ఆందోళనతో కన్నవారికి కడుపుకోత మిగిల్చి అనంతలోకాలకు వెళ్తుండటం చూసి ఆయా గ్రామాల ప్రజలు కన్నీటిపర్యంతమవుతున్నారు.
అంతకుముందు జరిగిన ఘటనల్లో హైదరాబాద్‌లోని వారసిగూడకు చెందిన కళ్యాణి, నాచారానికి చెందిన లక్ష్యతో పాటు మెదక్ జిల్లాకు చెందిన సాయిరాం, ఉట్నూర్‌కు చెందిన సౌజన్య, భూత్పూర్ మండలానికి చెందిన శ్రావణి, సూర్యాపేట జిల్లాకు చెందిన సౌజన్య, రంగారెడ్డి జిల్లాకు చెందిన అభియాదవ్ అనే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో విద్యావేత్తలు, మనస్తత్వ నిపుణులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలనేవి జీవితంలో ఒక భాగమే తప్ప, అవే జీవితం కాదని.. ఫెయిల్ అయిన విద్యార్థులకు తల్లిదండ్రులు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఒక్కసారి విఫలమైనంత మాత్రాన జీవితం ముగిసిపోదని, సప్లిమెంటరీ పరీక్షల ద్వారా తిరిగి విజయం సాధించే అవకాశం ఉందని విద్యార్థులకు హితవు పలుకుతున్నారు.






