ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

by Muthe.Rajitha |

ఈ ఏడాది ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను అత్యాధునిక సాంకేతికతతో, సిబ్బంది ప్రత్యక్ష పర్యవేక్షణలో పూర్తిచేశారు.

ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు, పరీక్షా విధానంలో పారదర్శకతను పెంచేందుకు వినూత్న సంస్కరణలు చేపట్టింది. ఈ ఏడాది ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను అత్యాధునిక సాంకేతికతతో, సిబ్బంది ప్రత్యక్ష పర్యవేక్షణలో పూర్తిచేశారు. నిరంతర నిఘాలో పరీక్షా కేంద్రాలు ​నాంపల్లిలోని ఇంటర్ విద్యా భవన్‌లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఈ నెల 2 నుండి ప్రారంభమైన ప్రాక్టికల్ పరీక్షలు బుధవారం తో ముగిశాయి. ప్రతిరోజూ ఉదయం 7.30 నుండి సాయంత్రం 6 గంటల వరకు 35 మంది గ్రంథపాలకులు, 35 మంది సాంకేతిక నిపుణులు సీసీఆర్ ద్వారా పరీక్షలను నిశితంగా పరిశీలించారు. 31 టెలివిజన్లు, ఒక భారీ వీడియో వాల్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలేజీలను అనుసంధానించారు. ​భారీ స్థాయిలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో ​పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు భారీగా కెమెరాలను అమర్చారు.

​ప్రభుత్వ కాలేజీల్లో 5,500 సీసీటీవీ కెమెరాలు, ​సెక్టార్ కాలేజీల్లో 1,300, ​ప్రైవేట్ కాలేజీల్లో 7,500 మొత్తం అన్ని కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించి లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ​సిసిఆర్ పర్యవేక్షణలో భాగంగా నిబంధనలు అతిక్రమించిన వారిపై బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. ​విధుల్లో నిర్లక్ష్యం వహించిన 53 మంది పరీక్షాధికారులను విధుల నుండి తొలగించారు. ​నిబంధనలు పాటించని 5 పరీక్షా కేంద్రాలను రద్దు చేసి, అక్కడి విద్యార్థులను సమీప కేంద్రాలకు తరలించారు. మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్ వంటి ఘటనలపై ఫ్లయింగ్ స్క్వాడ్స్, జిల్లా పరీక్షా కమిటీల ద్వారా తక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

1495 థియరీ పరీక్ష కేంద్రాల ఏర్పాటు:

​ఈ ఏడాది ప్రాక్టికల్ పరీక్షలకు జనరల్ విభాగంలో 3,11,011 మంది (34,400 సెషన్లలో), వొకేషనల్ విభాగంలో 80,254 మంది (16,000 సెషన్లలో) హాజరయ్యారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1,440 సాధారణ కేంద్రాలు, 484 వృత్తి విద్యా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాబోయే థియరీ పరీక్షల కోసం 1,495 కేంద్రాలను సిద్ధం చేసినట్లు బోర్డు కార్యదర్శి వెల్లడించారు. ​సాంకేతికత వినియోగం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, పరీక్షా వ్యవస్థపై నమ్మకం కలుగుతుందని ఇంటర్ బోర్డు ఈ సందర్భంగా పేర్కొంది.

Next Story