సాటి జంతువులను ఆదుకుంటున్న పిల్లి.. రూ.7.6 లక్షల సేకరణ!

by Disha Web Desk 17 |
సాటి జంతువులను ఆదుకుంటున్న పిల్లి.. రూ.7.6 లక్షల సేకరణ!
X

దిశ, ఫీచర్స్ : పెట్ యానిమల్స్ కంటెంట్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌కు చెందిన 'స్టెపాన్' అనే పిల్లి 2019లో టిక్‌టాక్ వీడియోల ద్వారా పాపులరైంది. ఆ తర్వాత 'క్యాట్ విత్ వైన్' ఫొటోలతో ఇన్‌స్టా‌లోనూ మిలియన్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ పిల్లి సంగతి ఇప్పుడెందుకు అంటే.. ఉక్రెయిన్‌‌పై రష్యా సాగిస్తున్న యుద్ధం కారణంగా దెబ్బతిన్న, ఒంటరైపోయిన జంతువుల కోసం విరాళాలు సేకరించి అందరి ప్రశంసలు అందుకుంటుంది.

ఖార్కివ్‌ నివాసి 'అన్నా'.. ప్రస్తుతం స్టెపాన్‌‌ను పెంచుకుంటున్నాడు. అయితే రష్యా దళాల దాడి నేపథ్యంలో ఒక బంకర్‌లో రెండు రోజులు తలదాచుకున్న అన్నా, స్టెపాన్ ఆ తర్వాత ఖార్కివ్‌ను వదిలి ఎల్వివ్‌కు ప్రయాణించారు. అయితే ఎన్నో ఒడిదుడుకుల నడుమ సాగిన వారి ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేశాడు అన్నా. అంతేకాదు యుద్ధంలో చిక్కుకున్న జంతువులకు సాయమందించాలని డిసైడ్ అయ్యాడు. ఈ మేరకు 'మై డియర్ ఫ్రెండ్స్.. ఉక్రెయిన్‌పై దాడి జరుగుతున్న నేపథ్యంలో నేను పక్కన నిలబడలేను. కానీ యుద్ధ బాధితుడిగా తోటి స్నేహితులకు సాయం చేయాలనుకుంటున్నాను' అంటూ ఇన్‌స్టా వేదికగా పిలుపునిచ్చాడు. దీంతో రూ. 7.6 లక్షల($10,035) విరాళాలు సమకూరాయి. ఈ డబ్బును 'హ్యాపీ పావ్, యూ యానిమల్స్, మైకో లైవ్ జూ, XII మంత్స్, ప్లూష్కా' స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందించడం విశేషం.

స్టెపాన్ ఇన్‌‌స్టా ఖాతా(Loveyoustepan)కు 1.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. కాగా హాలీవుడ్ సెలబ్రిటీలు బ్రిట్నీ స్పియర్స్, డయాన్ క్రుగర్, బీబర్‌ సహా ఎంతోమంది ప్రముఖులు స్టెపాన్ ఫొటోలు, వీడియోలను తమ తమ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇలా కష్ట సమయాల్లో ఇతర జంతువులను ఆదుకునేందుకు తమ ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించినందుకు గాను వారిద్దరికీ నెటిజన్లు ధన్యవాదాలు తెలిపారు.



Next Story