రాష్ట్రంలో అమానవీయ ఘటన.. కళ్లెదుటే భార్య కాలిపోతుంటే వీడియో రికార్డు చేసిన భర్త

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-16 10:48:25  IST  )

దేశంలో మహిళల వేధింపులు, గృహ హింస విషయంలో కఠిన చట్టాలు అమలు అవుతున్నా.. కొందరి మృగాళ్లలో ఏమాత్రం మార్పు రావడం లేదు.

రాష్ట్రంలో అమానవీయ ఘటన.. కళ్లెదుటే భార్య కాలిపోతుంటే వీడియో రికార్డు చేసిన భర్త
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మహిళల వేధింపులు, గృహ హింస విషయంలో కఠిన చట్టాలు అమలు అవుతున్నా.. కొందరి మృగాళ్లలో ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా మంటల్లో చిక్కుకుని తన భార్య ప్రాణాల కోసం అల్లాడుతుంటే, కనీసం కాపాడే ప్రయత్నం చేయకుండా భర్త తన ఫోన్‌లో వీడియో రికార్డ్ చేసిన వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. రంజిత్ సాహ్ (Ranjit Sah), ప్రతిమా దేవి (Prathima Devi) (31) దంపతులు సూరత్ (Surat) పట్టణంలో నివాసం ఉంటున్నారు. అయితే, కొన్నాళ్లుగా ఇద్దరూ గొడవ పడుతున్నారు. ఈ క్రమంలోనే జనవరి 4న మరోసారి ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రతిమా దేవి ఇంట్లో ఉన్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది.

భార్య ఆత్మహత్యకు పాల్పడుతుంటే ఏ భర్త అయినా వద్దని వారించి నచ్చజెబుతారు. కానీ, రంజిత్ సాహ్ అందుకు భిన్నంగా అత్యంత క్రూరంగా వ్యవహరించాడు. భార్య మంటల్లో కాలిపోతూ ఆర్తనాదాలు చేస్తున్నా, ఆమెను రక్షించే ప్రయత్నం చేయలేదు. పైగా తన మొబైల్ ఫోన్ తీసి ఆ దృశ్యాలను వీడియో తీస్తూ నిలబడ్డాడు. అనంతరం గమనించిన స్థానికులు తీవ్రగాయాలైన ప్రతిమా దేవిని ఆసుపత్రికి తరలించగా, అక్కడ వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి జనవరి 11న ఆమె తుదిశ్వాస విడిచింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంజిత్ సాహ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ భాగంగా ఎందుకు ప్రతిమా దేవిని కాపాడలేదని ప్రశ్నించగా.. షాకింగ్ సమాధానం చెప్పాడు. తాను ఊరికే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోందని.. ఆమె మరణానికి తనకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించుకోవడానికే నేను వీడియో తీశానంటూ చెప్పుకొచ్చారు. కాగా, ఆపదలో ఉన్న భార్యను కాపాడకుండా వీడియో తీయడం నేరమని పోలీసులు వెల్లడించారు. కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.

Read More... మంటగలిసిన మానవత్వం.. బాలుడి మృతదేహాన్ని పక్కకు నెట్టి..

Next Story