సైబర్ నేరగాడి వలలో ఇన్ఫోసిస్ ఉద్యోగిని

by Batti.Sumithra |

సైబర్ నేరగాడి మాయమాటలు నమ్మిన ఓ ఇన్ఫోసిస్ ఉద్యోగిని దాదాపు రూ.99.5 వేల మేర మోసపోయిన ఘటన పోచారం ఐటీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

సైబర్ నేరగాడి వలలో ఇన్ఫోసిస్ ఉద్యోగిని
X

దిశ, ఘట్‌కేసర్ : సైబర్ నేరగాడి మాయమాటలు నమ్మిన ఓ ఇన్ఫోసిస్ ఉద్యోగిని దాదాపు రూ.99.5 వేల మేర మోసపోయిన ఘటన పోచారం ఐటీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోచారంలోని అమిగోస్ లేడీస్ హాస్టల్‌లో నివసిస్తున్న జొన్నలగడ్డ లక్ష్మి అన్నపూర్ణ (25) ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. జూన్ 24వ తేదీ ఉదయం 8:26 గంటల సమయంలో ఆమెకు 8951773051 నంబర్ నుంచి వాట్సాప్‌లో ఒక సందేశం వచ్చింది. అందులో తనను తాను 'శరత్‌రామ్ రెడ్డి'గా పరిచయం చేసుకున్న వ్యక్తి, లింక్డ్‌ఇన్‌లో ఆమె పంచుకున్న జీతం వివరాలు, నోటీసు పీరియడ్ సమాచారం ద్వారా ఆమె ఫోన్ నంబర్ సంపాదించినట్లు తెలిపాడు. తర్వాత ఫ్రీలాన్సింగ్ ఉద్యోగ అవకాశం ఉందని చెప్పి, తనకు వాట్సాప్ ద్వారా రెజ్యూమ్ పంపాలని కోరాడు. ఆ పనికి సంబంధించిన చెల్లింపులు అమెరికన్ డాలర్లలో ఉంటాయని, ఆ మొత్తాన్ని తిరిగి తనకు పంపాల్సి ఉంటుందని నమ్మించాడు.

అనంతరం రూ.10 వేలు ఆమె ఖాతాకు పంపినట్లు ఒక స్క్రీన్‌షాట్ పంపించాడు. అయితే తన ఖాతాలో ఎలాంటి నగదు జమ కాలేదని అన్నపూర్ణ ప్రశ్నించగా, ఆ మొత్తాన్ని స్వీకరించాలంటే ఖాతాలో కనీసం రూ.10 వేల నిల్వ ఉండాలని, ప్రస్తుతం ఆమె ఖాతాలో రూ.4,500 మాత్రమే ఉన్నాయని చెప్పి ఆ మొత్తాన్ని తన పేటీఎం ఖాతాకు పంపించాలని కోరాడు. దీంతో బాధితురాలు ఆ డబ్బును పంపించింది. అనంతరం అంతర్జాతీయ లావాదేవీల కోసం ఖాతాను యాక్టివేట్ చేయాల్సి ఉందని, ఆమెకు రావాల్సిన డబ్బు 'హోల్డ్'లో ఉందని చెప్పి మరోసారి నమ్మించాడు. ఆ సమస్య పరిష్కారానికి 'మనీ వ్యూ' యాప్ ద్వారా రూ.1 లక్ష రుణానికి దరఖాస్తు చేయాలని సూచించాడు. రుణం మంజూరైన తర్వాత, దానిని ముందస్తుగా ముగించేందుకు డబ్బు చెల్లించాలని చెప్పి విడతల వారీగా నగదు బదిలీ చేయించాడు. నిందితుడి మాటలు నమ్మిన అన్నపూర్ణ తన ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా ద్వారా మొత్తం రూ.99,500 బదిలీ చేసింది. అనంతరం తాను సైబర్ మోసగాడి వలలో చిక్కుకున్నానని గ్రహించిన ఆమె జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోచారం ఐటీసీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Next Story