- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: ట్రాన్స్ జెండర్స్‌కు ఇందిరమ్మ ఇళ్లు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బీఆర్ఎస్‌కి రెఫరెండం అని చెప్పి చిత్తుచిత్తుగా పడిపోయినా కూడా ప్రజాప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు కారుకూతలు కూస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బీఆర్ఎస్‌కి రెఫరెండం అని చెప్పి చిత్తుచిత్తుగా పడిపోయినా కూడా ప్రజాప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు కారుకూతలు కూస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన అన్నీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కి ప్రజలు తగిన బుద్ధి చెబుతూనే వస్తున్నారని, మళ్లీ నిసిగ్గుగా మున్సిపాలిటీ ఎన్నికలు సెమీఫైనల్స్ అంటూ మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా పర్యటనలో భాగంగా రామగుండం మున్సిపాలిటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు, స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్‌లు, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
మమ్మల్ని విమర్శించడం హాస్యాస్పదం
అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రామగుండం స్థానిక శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అధ్యక్షతన జరిగిన ఇందిరమ్మ ఇండ్ల స్థలాల పట్టాలు, డబుల్ బెడ్‌రూం ఇళ్ల పత్రాల పంపిణీ ప్రజాసభలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అడ్రస్ లేకుండా ప్రతి ఎన్నికల్లో ఓడిస్తూనే ఉన్నారని, అయినా మీ ఇంట్లో రగులుతున్న కుటుంబ చిచ్చును ఆర్పుకోలేని నువ్వు తెలంగాణ ప్రజలకు ఏం చేస్తావని కేటీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. సొంత ఇంటి ఆడబిడ్డకు న్యాయం చేయలేని నాయకుడు తెలంగాణ మహిళలకు ఎలా న్యాయం చేస్తారో సమాధానం చెప్పాలన్నారు? ఇంకా పగటి కలలు కంటూ దొరగారి దర్పణాన్ని ప్రదర్శిస్తూ అవాకులు చవాకులు పేలుతున్నారని. పదేండ్లలో ప్రజల కష్టనష్టాలను పట్టించుకోని నేతలు ప్రజా పాలనను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికైనా గుండె మీద చెయ్యి వేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.
అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలను అందజేస్తాం
రెండేండ్ల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందిస్తూ ముందుకు పోతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా అన్ని రంగాల్లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ప్రగతిని సమపాళ్లలో తీసుకెళ్తున్నామని తెలిపారు. సింగరేణి పరివాహక ప్రాంతంలో 76 జీవో వల్ల నెలకొన్న సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సహచర మంత్రులతో చర్చించి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలను అందజేస్తామన్నారు. ఎక్కడైతే పట్టణాల్లో అధికారుల కొరత ఉందో తప్పకుండా ఆయాచోట్ల ఎమ్మార్వోలను నియమిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 586 మంది నిరుపేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు, 494 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో పాటు రాష్ట్రంలో మొదటిసారిగా 50 మంది ట్రాన్స్ జెండర్స్‌కు ఇళ్ల పత్రాలను అందించారు. అవినీతి ప్రభుత్వాన్ని పాతరేసి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్న ప్రజలు ఇప్పటివరకు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇందిరమ్మ ప్రభుత్వానికి అండగా నిలిచారని. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు మద్దతు పలికి మనస్ఫూర్తిగా ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.






