కారు ఉంటే ఇల్లు రాదు!

by Muthe.Rajitha |

కారు ఉంటే ఇల్లు రాదనే ఇందిరమ్మ పథకంలోని నిబంధన పేదలకు ఇబ్బందిగా మారింది.

కారు ఉంటే ఇల్లు రాదు!
X

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సంజయ్‌కి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అతనిది నిరుపేద కుటుంబం. ఉండేందుకు ఇల్లు సైతం సరిగా లేదు. దాంతో ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతో ఇల్లు నిర్మించుకోవాలని అనుకున్నాడు. కానీ.. అంతలోనే అధికారులు బాంబ్ పేల్చారు. ఆయనకు ఓ కారు ఉన్నది. దానిని క్యాబ్ నడిపిస్తున్నాడు. రోజువారీ డ్రైవర్ ఉద్యోగం చేస్తేనే ఆయన కుటుంబం గడిచేది. వచ్చిన డబ్బులతో కారు ఈఎంఐ కట్టుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కానీ.. ఇందిరమ్మ ఇల్లు ఆధార్ విచారణలో అతనికి కారు ఉన్నట్లుగా వెల్లడైంది. దాంతో ఆయనకు మంజూరైన ఇంటిని రద్దు చేశారు. ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.

---------------------

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన మధుసూదన్‌కు గత ప్రభుత్వం అమలు చేసిన దళితబంధు స్కీంలో భాగంగా రూ.10 లక్షలు వచ్చాయి. ఆ డబ్బులతో కారును కొనుగోలు చేశాడు. దాంతో అప్పటి నుంచి కారును నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇల్లు మంజూరైనా కారు ఉందన్న కారణంతో ఆయన దరఖాస్తును హోల్డ్‌లో పెట్టారు. దాంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ఇల్లు మంజూరు చేయాలని మధుసూదన్ ప్రజాప్రతినిధులు, అధికారులను కోరుతూనే ఉన్నాడు.

---------------------

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో ఒక నిబంధన ఇప్పుడు అనేక పేద కుటుంబాలకు ఇబ్బందిగా మారింది. కుటుంబానికి సొంతంగా కారు ఉంటే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా స్థిరంగా ఉన్నదిగా పరిగణించి ఇల్లు మంజూరు చేయకూడదనే నిబంధన అమల్లో ఉన్నది. అయితే.. ఈ రూల్ కారణంగా నిజంగా పేదరికంలో జీవిస్తున్న అనేక మంది క్యాబ్ డ్రైవర్లు పథకానికి అర్హత సాధించలేకపోతున్నారు. రాష్ట్రంలో చాలా మంది పేద కుటుంబాలు ఉపాధి కోసం పాత కార్లు కొనుగోలు చేసి క్యాబ్ డ్రైవర్‌లుగా జీవనం సాగిస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం లేదా రెండో చేతి వాహనాలు కొనడం ద్వారా వారు రోజువారీ ఆదాయం పొందుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే.. ప్రభుత్వ డేటాబేస్‌లో కారు ఉన్నట్టు నమోదవడంతో వారు ఆర్థికంగా బాగున్న వారిగా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఫలితంగా నిజంగా ఇల్లు లేని పేద కుటుంబాలైనా ఇందిరమ్మ పథకానికి అనర్హులుగా మారుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాబ్ కోసం కారు కొనుగోలు చేసిన వేలాది కుటుంబాలు ఇప్పుడు ఈ పథకానికి దూరం అయ్యాయి.

దళితబంధు లబ్ధిదారులూ దూరం

ఇంకా కొంతమంది పరిస్థితి మరింత విచిత్రంగా మారింది. గత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా పేద దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. అయితే.. ఈ సహాయం పొందిన చాలా మంది పేదలు జీవనోపాధి కోసం కార్లు కొనుగోలు చేశారు. ఈ పథకం ద్వారా పొందిన వాహనాలను ఉపయోగించి వారు డ్రైవింగ్ చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. కానీ.. అదే కారు కారణంగా ఇప్పుడు వారికి ఇందిరమ్మ ఇల్లు రాకుండా పోతుండటం పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వమే ఒక పథకం ద్వారా ఉపాధి కోసం కారు ఇచ్చి, మరో పథకంలో అదే కారణంతో అర్హతను తిరస్కరించడం అన్యాయమని బాధితులు అంటున్నారు. గ్రామస్థాయిలో జరిగిన సర్వే సమయంలో అధికారులు వారి పరిస్థితిని పరిశీలించి కొందరిని అర్హులుగా ఎంపిక చేసినట్లు సమాచారం. కానీ.. తర్వాత వాహనాల వివరాలు పరిశీలించగా కారు ఉన్నట్టు గుర్తించడంతో కొంతమందికి మంజూరైన ఇళ్లను రద్దు చేసినట్లు తెలుస్తోంది. దీనితో ఇల్లు వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్న పేద కుటుంబాలు తీవ్ర నిరాశకు గురవుతున్నాయి. ‘మేం కొనుగోలు చేసిన కార్లు విలాసం కోసం కాదు.. కేవలం జీవనోపాధి కోసం మాత్రమే.. రోజువారీ ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం.. అయినప్పటికీ కారు ఉన్న కారణంగా పథకం నుంచి తొలగించడం సరైన నిర్ణయం కాదు’ అని వారు అభిప్రాయపడుతున్నారు. ఉపాధి కోసం ఉపయోగిస్తున్న వాహనాలను ప్రత్యేకంగా పరిగణించి పేద డ్రైవర్లకు ఇందిరమ్మ ఇళ్లలో అర్హత కల్పించాలనే డిమాండ్ ప్రజాప్రతినిధుల నుంచి పెరుగుతున్నది. లేదంటే నిజంగా అవసరమైన పేద కుటుంబాలు ప్రభుత్వ గృహ పథకం ప్రయోజనాల నుంచి దూరమయ్యే ప్రమాదం ఉందని వారు సూచిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 3,68,540 ఇండ్లు

రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 3,68,540 ఇండ్లు మంజూరు చేయగా.. 2.50 లక్షల ఇండ్ల పనులు స్టార్ట్ అయ్యాయి. ఈ నెలాఖరు నాటికి లక్ష ఇండ్లు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. లక్ష గృహ ప్రవేశాలు చేయాలనే టార్గెట్‌తో ముందుకు సాగుతున్నారు. జీహెచ్ఎంసీ మినహా మిగతా కార్పొరేషన్లు, అర్బన్ ఏరియాల్లో సైతం ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. పీఎం ఆవాస్ స్కీమ్‌‌‌‌లో కేంద్రం ఇప్పటికే లక్షా 13 వేల ఇండ్లను మంజూరు చేసింది.

Next Story