వెనిజులాకు భారత్ "ఆపరేషన్ అమిస్టాడ్"

by Muthe.Rajitha |

ఇటీవల సంభవించిన భారీ భూకంపం కారణంగా అతలాకుతలమైన వెనిజులా దేశాన్ని ఆదుకునేందుకు భారత ప్రభుత్వం మానవతా దృక్పథంతో ముందుకు వచ్చింది.

వెనిజులాకు భారత్ ఆపరేషన్ అమిస్టాడ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల సంభవించిన భారీ భూకంపం కారణంగా అతలాకుతలమైన వెనిజులా దేశాన్ని ఆదుకునేందుకు భారత ప్రభుత్వం మానవతా దృక్పథంతో ముందుకు వచ్చింది. సంక్షోభంలో ఉన్న వెనిజులాకు అవసరమైన అత్యవసర వైద్య, సహాయక సామాగ్రిని అందించేందుకు భారత్ 'ఆపరేషన్‌ అమిస్టాడ్‌' (Operation Amistad) ను ప్రారంభించినట్లు విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అధికారికంగా ప్రకటించారు. స్పానిష్ భాషలో 'అమిస్టాడ్' అంటే 'స్నేహం' అని అర్థం. ఈ క్లిష్ట సమయంలో వెనిజులా ప్రభుత్వానికి, అక్కడి పౌరులకు అండగా నిలబడుతూ, అంతర్జాతీయంగా తన స్నేహహస్తాన్ని చాటడానికి భారత్ ఈ ఆపరేషన్‌ను చేపట్టింది.

భారీ సహాయక సామగ్రితో బయల్దేరిన భారత సైన్యం

ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత సైన్యానికి చెందిన రెండు అత్యాధునిక సీ-17 (C-17) గ్లోబ్‌మాస్టర్ రవాణా విమానాలు సహాయక చర్యలకు అవసరమైన సామగ్రితో వెనిజులాకు బయలుదేరాయి. ఈ విమానాల్లో దాదాపు 35 టన్నులకు పైగా బరువైన అత్యవసర సహాయక సామాగ్రి, ప్రాణాలు రక్షించే ఔషధాలు, వైద్య పరికరాలను తరలిస్తున్నారు. విపత్తు సమయాల్లో క్షతగాత్రులకు తక్షణమే వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ సామగ్రిని భారత్ పంపించింది.

మొబైల్ ఆసుపత్రులు, వైద్య సహాయం

భూకంప ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చికిత్స అందించడం కోసం భారత సైన్యానికి చెందిన ప్రత్యేక ఫీల్డ్‌ హాస్పిటల్‌ యూనిట్‌ను రంగంలోకి దించారు. దీనితో పాటు అత్యవసర సమయాల్లో క్షతగాత్రులకు అక్కడికక్కడే ప్రాథమిక, అధునాతన చికిత్స అందించే సామర్థ్యమున్న రెండు మొబైల్‌ ఆసుపత్రి టెంట్లు (BHISHM Cubes) ను కూడా భారత్ తరలించింది. విపత్కర పరిస్థితుల్లో సైతం వైద్య సేవలు కుప్పకూలకుండా బాధితులను రక్షించడానికి ఈ భీష్ (BHISHM) క్యూబ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.

Next Story