- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"ఇడుపు కాయితం"పై ట్రోలింగ్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ప్రొ.ఘంటా చక్రపాణి
ప్రియదర్శి, నాగ దుర్గ జంటగా తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న "ఇడుపు కాయితం" అనే సినిమా పోస్టర్ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసింది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రియదర్శి, నాగ దుర్గ జంటగా తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న "ఇడుపు కాయితం" అనే సినిమా పోస్టర్ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసింది. ఈ చిత్రం టైటిల్‌ను లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు నెటిజన్లు, ట్రోలర్లు తీవ్రంగా ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. "ఈ సినిమాను ఆంధ్రా తెలుగులోకి డబ్బింగ్ చేస్తారా?", "తెలంగాణ భాషలోనే ఉంటుందా?", "మాకు సబ్ టైటిల్స్ వేయండి" అంటూ తెలంగాణ యాసను, ఇక్కడి చిత్రాలను చులకన చేస్తూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల నెటిజన్ల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు తెరలేపింది.
తెలంగాణ సంస్కృతిని, భాషను అవమానించేలా జరుగుతున్న ఈ ట్రోలింగ్‌పై తెలంగాణ మేధావులు, ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే TGPSC మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి రంగంలోకి దిగి ట్రోలర్లకు సోషల్ మీడియా వేదికగా అత్యంత ఘాటుగా సమాధానమిచ్చారు. "ఇడుపు కాయితం" అనే పేరులోనూ, దాని భావంలోనూ స్పష్టత ఉందని.. దానికి అర్థం 'విడిపోయే కాగితం' లేదా విడిపోయేటప్పుడు రాసుకునే ఒక ఒప్పంద పత్రమని ఆయన వివరించారు. తెలంగాణ సినిమాలపై కొంతమంది చూపిస్తున్న ఈ ఓర్వలేనితనాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
ఈ సందర్భంగా ఆయన ఆంధ్రా ప్రాంతంలో సాధారణంగా వాడే 'విడాకులు' అనే పదాన్ని ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చారు. "మరి 'విడాకులు' అనే పదంలో ఏముందిరా? ఆకులా? అర్థం కాకపోతే నోరు మూసుకోండి. ఈ సినిమాకు ఎలాంటి సబ్ టైటిల్స్ ఉండవు, నచ్చకపోతే చూడకండి" అంటూ ట్రోలర్లకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఘంటా చక్రపాణి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో, ఈ టైటిల్ వివాదం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్‌గా మారింది.






