- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రగ్స్ వాడినా, సరఫరా చేసినా.. ఎంతటివారైనా వదిలిపెట్టం : డిప్యూటీ సీఎం భట్టి
జీవితం చాలా విలువైనదని, డ్రగ్స్ బారిన పడి ఎవరూ.. ముఖ్యంగా యువత జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు.

దిశ, వెబ్‌డెస్క్: జీవితం చాలా విలువైనదని, డ్రగ్స్ బారిన పడి ఎవరూ.. ముఖ్యంగా యువత జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ వాడకంపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం, సరఫరాను సమూలంగా రూపుమాపేందుకు ఈగల్ ఫోర్స్ సంపూర్ణంగా పనిచేసేలా అన్ని వసతులు కల్పించామని వెల్లడించారు. ప్రతి తల్లి-తండ్రి తమ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నట్లే.. ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. సమాజానికి మంచి చేసేందుకు పోలీసులు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారని, తమ జీవితాలను రిస్కులో పెట్టి, డ్రగ్స్ ముఠాలను పట్టుకుంటున్నారని తెలిపారు.
మారకపోతే.. ఎన్నిచేసినా వేస్ట్..
డ్రగ్స్ వాడుతూ, సరఫరా చేస్తూ దొరికినవారెవరైనా సరే.. వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు ఎలాంటి కఠిన నిర్ణయమైనా తీసుకుంటామన్నారు. తెలంగాణలో పుట్టి - పెరగడం ఒక భరోసాగా భావించే పరిస్థితుల్ని ప్రభుత్వం కల్పిస్తున్న క్రమంలో.. మత్తుపదార్థాలను వాడకూడదన్నదానిపై సమాజంలో పరివర్తన రాకుంటే.. ఇలాంటివి ఎన్నిచేసినా ప్రయోజనం శూన్యమన్నారు. ఇక సినిమా నటీనటులు ఏది చెప్తే దానిని నమ్మే అభిమానుల కోసం.. నటీనటులంతా సే నో టూ డ్రగ్స్ వీడియో సందేశం ఇవ్వాలని భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ లు కోరారు.






