- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిమ్స్‌ను గాడిన పెట్టడమే లక్ష్యం... నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్
సరిగ్గా పనిచేయని వ్యవస్థను చక్కదిద్ది, నిమ్స్ ఆసుపత్రిని మళ్లీ గాడిన పెట్టేందుకు, పేద రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను డైరెక్టర్‌గా నియమించారని ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సరిగ్గా పనిచేయని వ్యవస్థను చక్కదిద్ది, నిమ్స్ ఆసుపత్రిని మళ్లీ గాడిన పెట్టేందుకు, పేద రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను డైరెక్టర్‌గా నియమించారని ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిమ్స్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు తామంతా నిరంతరం కష్టపడుతున్నామని స్పష్టం చేశారు. డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చే నిరుపేదలకు వైద్యం అందక ఎదురుచూసే పరిస్థితి లేకుండా పరిపాలనా పరంగా విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు వెల్లడించారు. తాను బాధ్యతలు స్వీకరించిన ఈ మూడు వారాల కాలంలో ఒక్క అత్యవసర (ఎమర్జెన్సీ) రోగిని కూడా వెనక్కి తిప్పి పంపలేదని డైరెక్టర్ ప్రకటించారు. ఉదయం రౌండ్స్ మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఎమర్జెన్సీ విభాగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, నిత్యం 12 నుండి 14 గంటల పాటు తాము శ్రమిస్తున్నట్లు తెలిపారు. ఎమర్జెన్సీలో గతంలో 40 నుండి 50 మంది రోగుల టర్నోవర్ ఉండగా, ఇప్పుడు దాన్ని 75 నుండి 80 కి పెంచామన్నారు. తక్కువ తీవ్రత ఉన్న కేసులను వెంటనే ఇతర వార్డులకు తరలించడం ద్వారా అత్యవసర బెడ్స్ ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూస్తున్నామని వివరించారు.
నిరీక్షణకు చెక్.. కౌంటర్ల సంఖ్య రెట్టింపు...
ఆసుపత్రిలో రోగుల నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు ఓపీ కార్డులు, బ్లడ్ శాంపిల్స్ సేకరణ, బిల్లింగ్ కౌంటర్ల సంఖ్యను రెట్టింపు (గతంలో 2 ఉంటే ఇప్పుడు 4 కు) చేసినట్లు దేవరాజ్ పేర్కొన్నారు. బిల్లింగ్ ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రతి కౌంటర్ వద్ద సీసీ కెమెరాలు పెట్టామన్నారు. అలాగే సాధారణంగా ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే బిల్లింగ్‌ను ఉదయం 8:30 గంటలకే మార్చామని, డ్యూటీ వైద్యులు రాత్రి వేళల్లోనే డిశ్చార్జ్ సమ్మరీలను రాసేలా ఆదేశాలిచ్చామని తెలిపారు. దీనివల్ల ఉదయాన్నే రోగులు వేగంగా డిశ్చార్జ్ అయి వెళ్ళిపోవచ్చని చెప్పారు. రేడియాలజీ విభాగంలో నెలకొన్న సమస్యలను అడ్రస్ చేస్తూ.. సీటీ, ఎంఆర్ఐ స్కాన్ నివేదికల కోసం రోజుల తరబడి నిరీక్షించకుండా కొత్త సర్క్యులర్ జారీ చేశామన్నారు. ఇకపై ఎంఆర్ఐ స్కాన్ నివేదికలను 48 గంటల్లోనే రోగులకు అందించాలని, అల్ట్రాసౌండ్ పరీక్షల కోసం సుదీర్ఘ తేదీలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. రోగుల సౌకర్యార్థం రివ్యూ ఓపీ కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు నిమ్స్ ఓపీ వైద్య సేవలను మరింత సులభతరం చేసేందుకు ఆన్‌లైన్ ఓపీ విధానాన్ని త్వరలోనే పూర్తిస్థాయిలో పటిష్ఠం చేయబోతున్నట్లు హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ సేవలు నిమ్స్ లో విజయవంతంగా కొనసాగుతున్నాయని డైరెక్టర్ తెలిపారు. ఆరోగ్య శ్రీ బకాయిలు క్రమం తప్పకుండా వస్తున్నాయని అన్నారు. నిమ్స్‌లో క్యాష్‌లెస్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన ఫైర్, పొల్యూషన్ సేఫ్టీ అనుమతుల ప్రక్రియ చివరి దశకు చేరిందన్నారు. అలాగే 1984 కాలం నాటి పాత లాండ్రీ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఆధునీకరించి, ఆటోమేటెడ్ యంత్రాలను తీసుకురావడమే తమ తదుపరి ప్రాధాన్యతని వివరించారు.
దురుసు ప్రవర్తనపై జీరో టాలరెన్స్...
రోగులు ఎంతో బాధతో ఆసుపత్రికి వస్తారని, వారి పట్ల సిబ్బంది గానీ, వైద్యులు గానీ దురుసుగా ప్రవర్తిస్తే సహించేది లేదని డైరెక్టర్ హెచ్చరించారు. ఈ విషయంలో 'జీరో టాలరెన్స్' విధానాన్ని అవలంబిస్తున్నామని, తప్పు చేసినట్లు రుజువైతే ఎంతటి వారైనా సస్పెండ్ లేదా డిస్మిస్ చేయడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు. ఆసుపత్రిలోని లోపాలను, సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తామని, నిమ్స్ ప్రతిష్టను కాపాడటంలో మీడియా సైతం సానుకూలంగా సహకరించాలని ఆయన కోరారు. ఎమర్జెన్సీ రోగులను కొందరు ప్రైవేటుకు తరలిస్తున్నారనే ఆరోపణపై ఆయన స్పందించారు. అలాంటి వాటికి అవకాశమే లేకుండా చేశామని... కానీ ఏదైనా ఫిర్యాదులు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. త్వరలో పేషెంట్ రివ్యూ విధానాన్ని ప్రవేశపెడతామని ఆయన హామీ ఇచ్చారు. నిమ్స్ డీన్ ప్రొఫెసర్ చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పరంజ్యోతి, పీఆర్ఓ సత్యగౌడ్ ఉన్నారు.






