చాకచక్యంగా సుపారీ గ్యాంగ్‌ను పట్టుకున్న కాటారం పోలీసులు..

by Kodari Anjali |

సుపారీ గ్యాంగ్‌ను కాటారం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

చాకచక్యంగా సుపారీ గ్యాంగ్‌ను పట్టుకున్న కాటారం పోలీసులు..
X

దిశ, కాటారం: కాటారం మండలంలో ఇటీవల జరిగిన చిగురు గణేష్ హత్యాయత్నం కేసు మిస్టరీని కాటారం పోలీసులు ఛేదించారు. అల్లుని హత్య చేయించేందుకు అత్త సుపారీ ఇచ్చి కుట్ర పన్ని, హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ఐదుగురు నిందితులను పట్టుకొని అరెస్టు చేసినట్టు కాటారం సీఐ నాగార్జున రావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాటారం మండలం గ్రామానికి చెందిన చిగురు గణేష్ తన భార్య మరణానికి సంబంధించిన కేసులో నిందితుడిగా ఉండటంతో, అతని అత్త అయిన చింత రాజేశ్వరి తన కుమార్తె మరణానికి అల్లుడే కారణమని భావించి అతనిపై తీవ్ర కక్ష పెంచుకుంది. తన కుమార్తెను కోల్పోవడంతో పాటు, ఇద్దరు మనుమలను తన వద్ద వదిలేసి, వారి పోషణ బాధ్యతలు కూడా తీసుకోకపోవడంతో అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో చింత రాజేశ్వరి పరిచయమైన వ్యక్తి దరంసోత్ రవీందర్ నాయక్, అల్లుడు గణేష్‌ను హత్య చేయించేందుకు సుపారీ ఇవ్వాలని అత్త నిర్ణయించింది. ఈ మేరకు రవీందర్ నాయక్‌తో రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్ లక్ష రూపాయలు చెల్లించి, అల్లుడు ఫోటోను గుర్తింపు కోసం అందజేసినట్లు విచారణలో తేలింది. అనంతరం దరంసోత్ రవీందర్ నాయక్, డబ్బు ఆశ చూపి తడగొండ దామోదర్, కొలపాక నాగార్జున్, పోలు ప్రశాంత్ తనతో కలుపుకొని హత్యకు కుట్ర పన్నాడు.

మిగిలిన డబ్బు ఇప్పించాలని కోరగా..

22-06-2026న నిందితులు, చిగురు గణేష్ గ్రామానికి వెళ్లి అతనిని గుర్తించి పరిస్థితులను పరిశీలించారు. గ్రామంలో ప్రజల సంచారం ఎక్కువగా ఉండటంతో ఆరోజు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మరుసటి రోజు కారు బానెట్ తెరిచి రోడ్డుపై నిలిపి, అందరూ చూస్తే కారు కారాబు అయినది అని అనుకునేవిధంగా ఉంచి, అటుగా వస్తున్న గణేష్ బైక్ ఆపి, కారు తోసేందుకు సహాయం చేయమని కోరారు. అతను సహాయం చేస్తుండగా, కొలపాక నాగార్జున్ కత్తితో అతని ఛాతిపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. గణేష్ గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అతనిని పొలంలోకి తోసివేసి కారులో అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం నిందితులు దరంసోత్ రవీందర్ నాయక్‌ను సంప్రదించి మిగిలిన డబ్బు ఇప్పించాలని కోరగా, 26-06-2026న అందరూ కలిసి చింత రాజేశ్వరి ఇంటి వద్ద డబ్బు విషయమై చర్చిస్తున్న సమయంలో పోలీసులకు అందిన సమాచారంతో దాడి నిర్వహించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు తమ పాత్రలకు సంబంధించిన వివరాలను వెల్లడించినట్లు దర్యాప్తులో తేలింది. కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలు మరియు ఇతర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది. కేసుకు సంబందించిన నిందితులను పట్టుకోవడంలో ప్రధాన పాత్ర వహించిన కాటారం సీఐ ఈ.నాగార్జునరావు, సిహెచ్, ఎస్సై శ్రీనివాస్ ఎస్సై 2 జక్కుల మహేష్, కాటారం పి యస్ సిబ్బందిని కాటారం డి.ఎస్.పి సూర్యనారాయణ అభినందించారు.

Next Story