- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పక్కింటి స్వాతినే నిందితురాలు.. చిన్నారి నిత్విక కేసులో కీలక విషయాలు
లింగాల మండలం లోపట్నూతలలో నాలుగేళ్ల చిన్నారి నిత్విక అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఘటన జరిగిన 24 గంటలు పూర్తికాకముందే దర్యాప్తు చేపట్టి పక్కింట్లో నివసించే స్వాతినే నిందితురాలిగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు....

దిశ, పులివెందుల: లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో నాలుగేళ్ల చిన్నారి నిత్విక అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఘటన జరిగి 24 గంటలు పూర్తికాకముందే దర్యాప్తు చేపట్టి పక్కింట్లో నివసించే స్వాతినే నిందితురాలిగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఆమెపై హత్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు. లోపట్నూతల గ్రామానికి చెందిన సృజన శ్రీ, రామాచారి దంపతుల కుమార్తె నిత్విక (4) గురువారం నీళ్ల డ్రమ్ములో మృతి చెందిన స్థితిలో కనిపించడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారి మృతిపై తల్లిదండ్రులు, గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
రాత్రివేళ ధర్నా.. న్యాయం కోసం ఆందోళన
చిన్నారిని హత్య చేసి నీళ్లలో పడవేశారని ఆరోపిస్తూ గురువారం రాత్రి 9.30 గంటల నుంచి పులివెందుల–పార్నపల్లె రింగ్ రోడ్డుపై తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్థులు ధర్నాకు దిగారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న డీఎస్పీ మురళి నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చిన్నారి మృతి ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
బంధువుల నిరసన.. కఠిన శిక్షకు డిమాండ్
శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులు పులివెందుల రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద, పూలంగల సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. చిన్నారి విషయంలో జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితురాలికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. కుటుంబాల మధ్య ఉన్న వివాదాలకు చిన్నారిని బలి చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మురళి నాయక్ బాధితులను కలిసి మాట్లాడారు. నిందితురాలు వెనుక ఎవరున్నా చట్టపరంగా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం, సీసీ కెమెరాల ఆధారాలతో దర్యాప్తు ముందుకు సాగిందని తెలిపారు.
పోలీసుల మీడియా సమావేశం
పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ మురళి నాయక్ మాట్లాడుతూ చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు లింగాల ఎస్సై జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పాత చట్టం ప్రకారం 302 ఐపీసీ కింద, ప్రస్తుత చట్టం ప్రకారం 46/26 బి ఎన్ ఎస్ 102 / క్లాజ్ 1 ప్రకారం సంబంధిత సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఎస్పీ సచేత్ విశ్వనాథ్ సహకారంతో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందాలను రంగంలోకి దింపి ఆధారాలు సేకరించామని చెప్పారు. సీసీ కెమెరా ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా స్వాతిపై అనుమానం బలపడిందన్నారు.
ఇప్పటికే కుటుంబాల మధ్య వివాదాలు ఉన్నట్లు వెల్లడి
డీఎస్పీ మాట్లాడుతూ ఇరువురు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయని, గతంలో వాహనాల దహనం వంటి ఘటనలు కూడా జరిగినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఎస్సై జగదీశ్వర్ రెడ్డి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించడంతో పాటు తహసీల్దార్ వద్ద లక్ష రూపాయల పూచీ కత్తుతో బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించిన కారణంగా నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పూచీకత్తు సొమ్మును కూడా స్వాతి చేత రాబట్టేందుకు మండల తాసిల్దార్‌కు సిఫారసు చేయడం కూడా జరుగుతుందన్నారు. ఆధారాలను మరింత బలోపేతం చేసి కోర్టులో హాజరుపరిచేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పోస్టుమార్టం కోసం కడప రిమ్స్‌కు తరలింపు
పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. నీటి నమూనాలు, ఇతర ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి నిత్విక మృతితో విషాదంలో మునిగిన లోపట్నూతల గ్రామస్థులు.. వేగంగా స్పందించి దర్యాప్తు చేసిన పోలీసులపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. నిందితురాలికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడాలని గ్రామస్థులు కోరుతున్నారు.






