భారత మహిళల జట్టు ఘోర పరాజయం.. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా

by Malleboina Mahesh |

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి. జార్జియా వోల్ సెంచరీతో ఆసీస్ సిరీస్ కైవసం. హర్మన్‌ప్రీత్ హాఫ్ సెంచరీ వృథా

భారత మహిళల జట్టు ఘోర పరాజయం.. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా
X

దిశ, వెబ్ డెస్క్: భారత జట్టుకు మరో ఓటమి ఎదురైంది. హోబర్ట్‌లోని బెల్లెరివ్ ఓవల్ వేదికగా జరిగిన రెండో వన్డే (second ODI)లో భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా చేతిలో 5 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ (India) నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (31), ప్రతిక రావల్ (52) తొలి వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యంతో మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (54) వరుసగా రెండో హాఫ్ సెంచరీతో రాణించినప్పటికీ, మిడిల్ ఆర్డర్ వైఫల్యం తో భారత్ భారీ స్కోరు సాధించలేకపోయింది.

అనంతరం 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా (Australia) మహిళల జట్టు కేవలం 36.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ బ్యాటర్ జార్జియా వోల్ (101) అద్భుత సెంచరీతో భారత్ ఆశలపై నీళ్లు చల్లగా, ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (80) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. భారత బౌలర్లలో కాశ్వి గౌతమ్, దీప్తి శర్మ తలో రెండు వికెట్లు తీసినా ఆసీస్ జోరును అడ్డుకోలేకపోయారు. వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్, ఆదివారం (మార్చి 1) ఇదే వేదికపై జరగనున్న నామమాత్రపు మూడో వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది.

Next Story