రికార్డు స్థాయిలో పెట్టుబడులను సాధించిన భారత టెక్ స్టార్టప్‌లు!

by Disha Web |
రికార్డు స్థాయిలో పెట్టుబడులను సాధించిన భారత టెక్ స్టార్టప్‌లు!
X

బెంగళూరు: భారత టెక్ స్టార్టప్ కంపెనీలు 2021లో ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ కేపిటల్ సంస్థల నుంచి రికార్డు స్థాయిలో నిధులను సేకరించాయి. ప్రముఖ గ్లోబల్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్, అడ్వైజరీ సేవల సంస్థ ప్రాక్సిస్ గ్లోబల్ అలయన్స్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ పల్స్ నివేదిక ప్రకారం.. గతేడాది పెట్టుబడిదారుల నుంచి దేశీయ స్టార్టప్ కంపెనీలు మొత్తం 1,123 ఒప్పందాల ద్వారా 74 బిలియన్ డాలర్ల(రూ. 5.63 లక్షల కోట్ల)ను సేకరించాయి. ఇందులో అత్యధికంగా 56 శాతంతో ఈ-కామర్స్, కన్స్యూమర్, ఐటీ సేవల రంగాల్లో పెట్టుబడులు వచ్చాయి. అలాగే, సమీక్షించిన ఏడాదిలో యూనికార్న్ హోదాలో 41 కంపెనీలు కొత్తగా వచ్చి చేరాయని, ఇది గతంలో కంటే రికార్డు స్థాయిలో మూడు రెట్లు పెరిగాయని నివేదిక వివరించింది.

'2021లో టెక్, ఇంటర్నెట్ కంపెనీలకు రికార్డు స్థాయిలో 40 బిలియన్ డాలర్ల(రూ. 3 లక్షల కోట్లకు పైగా) ఒప్పందాలు జరిగాయి. వీటితో పాటు ఐటీ సేవలు, ఆరోగ్య సంరక్షణ, తయారీ వంటి ఇతర రంగాలు కూడా మెరుగ్గా నిధులను సాధించాయని ' ప్రాక్సిస్ గ్లోబల్ అలయన్స్ మేనేజింగ్ పార్ట్‌నర్, సీఈఓ మాధుర్ సింఘాల్ చెప్పారు. దేశీయ టెక్ స్టార్టప్‌లు 2022లోనూ గణనీయంగా పెట్టుబడులను అందుకుంటాయని ఆయన అంచనా వేశారు. ముఖ్యంగా సాఫ్ట్ యాజ్ ఏ సర్వీస్, కన్స్యూమర్, బీ2బీ టెక్, హెల్త్‌కేర్ రంగాలపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించవచ్చని నివేదిక అంచనా వేసింది.


Next Story