భారత్-అమెరికా వాణిజ్య మైత్రి.. 'వికసిత భారత్' దిశగా చారిత్రక అడుగు: ప్రధాని మోడీ

by Malleboina Mahesh |

భారత్- అమెరికా దేశాల కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన అధికారిక ముసాయిదాను అమెరికా ప్రభుత్వ ఈ రోజు విడుదల చేసింది.

భారత్-అమెరికా వాణిజ్య మైత్రి.. వికసిత భారత్ దిశగా చారిత్రక అడుగు: ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: భారత్- అమెరికా దేశాల కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన అధికారిక ముసాయిదాను అమెరికా ప్రభుత్వ ఈ రోజు విడుదల చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఒక నూతన అధ్యాయం మొదలైందని.. రెండు దేశాల మధ్య 'మధ్యంతర వాణిజ్య ఒప్పందం' (Interim Trade Agreement) కోసం ఒక సమగ్ర ఫ్రేమ్‌వర్క్ ఖరారైనట్లు ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా ప్రకటించారు. భారత్-అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేయడంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపిన వ్యక్తిగత ఆసక్తి, నిబద్ధతకు ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర నమ్మకానికి, వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనమని మోడీ పేర్కొన్నారు.

'మేక్ ఇన్ ఇండియా' భారీ ఊతం

భారత్, అమెరికా దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి భారీ ఊతాన్నివ్వనుంది. అమెరికా వంటి అగ్రరాజ్య మార్కెట్లు సులభంగా అందుబాటులోకి రావడం వల్ల భారతదేశంలోని కష్టపడి పనిచేసే రైతులు, వ్యవస్థాపకులు, స్టార్టప్ ఆవిష్కర్తలు, మత్స్యకారులకు అపారమైన అవకాశాలు లభిస్తాయని ప్రధాని వెల్లడించారు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEలు) ఈ ఒప్పందంతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మహిళలు, యువతకు భారీ అవకాశాలు..

అలాగే ఆర్థిక ప్రయోజనాలతో పాటు, ఈ ఒప్పందం సామాజిక మార్పుకు కూడా ఈ ఒప్పందం నాంది పలకనుంది. దేశవ్యాప్తంగా మహిళలు, యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలను కల్పించడమే ఈ ఫ్రేమ్‌వర్క్ యొక్క ప్రధాన లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు. కేవలం వస్తువుల క్రయవిక్రయాలకే పరిమితం కాకుండా, పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలను (Technology Partnerships) మరింత లోతుగా పెంచుకోవడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఈ ఒప్పందం ఒక వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

చివరగా, గ్లోబల్ సప్లై చైన్ (ప్రపంచ సరఫరా వ్యవస్థ) ను బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోడీ వివరించారు. సురక్షితమైన, నమ్మదగ్గ సరఫరా వ్యవస్థల ద్వారా ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ తన వంతు సహకారాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు. 'వికసిత భారత్' నిర్మాణమే లక్ష్యంగా, ప్రజలందరికీ ఉమ్మడి శ్రేయస్సును చేకూర్చే ఇలాంటి భవిష్యత్-ఆధారిత అంతర్జాతీయ భాగస్వామ్యాల పట్ల భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ప్రధాని మోడీ తన ట్వీట్ ద్వారా పునరుద్ఘాటించారు.

Next Story