కీలక ఆర్థిక పునరుద్ధరణ దశలో భారత్: నీతి ఆయోగ్ వైస్-చైర్మన్!

by Disha Web |
కీలక ఆర్థిక పునరుద్ధరణ దశలో భారత్: నీతి ఆయోగ్ వైస్-చైర్మన్!
X

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ కీలక పునరుద్ధరణ దశలో ఉందని నీతి ఆయోగ్ వైస్-చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. గడిచిన ఏడేళ్లలో ప్రభుత్వం తీసుకున్న అనేక సంస్కరణల ద్వారా పునాదులు బలంగా మారాయని, ఇలాంటి సమయంలో ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణ పరిస్థితుల వల్ల సవాళ్లను ఎదుర్కొంటుందనే సమస్య ఉండదని ఆదివారం ఓ ప్రకటనలో అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన ఆర్థిక అనిశ్చితి ప్రపంచ సరఫరాపై ప్రభావం చూపుతున్నప్పటికీ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని రాజీవ్ కుమార్ తెలిపారు.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.8 శాతం వృద్ధి రేటును సాధించగలదనే విశ్వాసం ఉందన్నారు. ఇక, ఇటీవల పరిణామాల కారణంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐ అవసరమైన చర్యలు చేపడుతోందని చెప్పారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.07 శాతంగా నమోదైంది. ఇది వరుసగా రెండో నెలలో ఆర్‌బిఐ లక్ష్యం కంటే ఎక్కువగానే ఉంది. అదేవిధంగా ముడి చమురు, ఆహారేతర వస్తువుల ధరలు అధికంగా ఉన్న కారణంగా టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 13.11 శాతానికి పెరిగింది. ఈ క్రమంలోనే ఇంధన ధరల పెరుగుదల గురించి ప్రస్తావించిన ఆయన.. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయి.


ఇదివరకే కేంద్రం సుంకాలను తగ్గించింది. కాబట్టి ప్రస్తుతం ఇంధన ధరలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలను తగ్గించేందుకు ప్రయత్నించాలన్నారు. కాగా, ఇంధనంతో పాటు ఇతర కమొడిటీ ధరలను ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని, తగిన సమయంలో కావాల్సిన చర్యలు తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.

Next Story