బ్యాంకు మోసాలతో దేశానికి రోజుకు రూ. 100 కోట్ల నష్టం!

by Disha Web Desk 17 |
బ్యాంకు మోసాలతో దేశానికి రోజుకు రూ. 100 కోట్ల నష్టం!
X

న్యూఢిల్లీ: గత ఏడేళ్లలో బ్యాంకుల్లో జరిగే మోసాలు, స్కామ్‌ల కారణంగా దేశానికి రోజుకు సగటున రూ. 100 కోట్ల నష్టం వాటిల్లుతోందని తాజా ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో గత ఐదేళ్ల నుంచి ప్రతి ఏటా ఈ నష్టం క్రమంగా తగ్గుతోందని గణాంకాలు పేర్కొన్నాయి. తగిన నిర్ణయాలు, సరైన సమయంలో నివారణ వంటి చర్యలతో గత కొన్నేళ్లుగా మోసాలు, స్కామ్‌లను తగ్గించగలిగినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. బ్యాంకుల్లో మోసాలు జరిగిన వెంటనే ఫిర్యాదులు అందుతుండటం వల్ల కొంతవరకు క్షీణిస్తున్నాయని వివరించింది.

మొత్తం నష్టంలో దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్ర 50 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, తెలంగాణ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాలు మాత్రమే రూ. 2 లక్షల కోట్ల(83 శాతం వాటా)కు పైగా నష్టాన్ని చూస్తున్నాయి. 2015 నుంచి గతేడాది డిసెంబర్ చివరి నాటికి ఆర్‌బీఐ సేకరించిన గణాంకాల ఆధారంగా వివరాలు వెల్లడయ్యాయి. ఆర్థిక అవకతవకలకు పాల్పడేవారిని శిక్షించడమే కాకుండా, దాన్ని నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యల వల్ల మోసాలు తగ్గుతున్నాయని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు వై సుదర్శన్ అన్నారు.


Next Story

Most Viewed