గోవాలో భారత ఇంధన వారోత్సవం.. 700కు పైగా కంపెనీల ప్రదర్శనలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-08 16:00:00  IST  )

గోవా వేదికగా జనవరి 27 నుంచి 30 వరకు భారత ఇంధన వారోత్సవం-2026 జరుగనుంది.

గోవాలో భారత ఇంధన వారోత్సవం.. 700కు పైగా కంపెనీల ప్రదర్శనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గోవా వేదికగా జనవరి 27 నుంచి 30 వరకు భారత ఇంధన వారోత్సవం-2026 జరుగనుంది. 120కి పైగా దేశాల నుంచి దాదాపు 75,000 మంది ఇంధన రంగ నిపుణులు, 700కు పైగా దేశీ–విదేశీ కంపెనీలు, 6,500 మందికి పైగా ప్రతినిధులు ఈ అంతర్జాతీయ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. 2026 సంవత్సరంలో జరిగే తొలి ప్రధాన అంతర్జాతీయ ఇంధన సదస్సుగా దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఈ వారోత్సవం ద్వారా ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతికత, మార్కెట్ల అనుసంధానం వంటి అంశాలపై ప్రపంచ స్థాయి చర్చలు జరగనున్నాయి. విధానాలను ఆచరణలోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

700 కంపెనీల భారీ ప్రదర్శన

ఈ వారోత్సవంలోని ప్రధాన ఆకర్షణగా జరిగే ప్రదర్శనలో హైడ్రోకార్బన్లు, పునరుత్పాదక ఇంధనం, హైడ్రోజన్, బయో ఫ్యూయల్స్, ఎల్ఎన్‌జీ, పెట్రోకెమికల్స్, డిజిటలైజేషన్, తదుపరి తరం ఇంధన వ్యవస్థలపై అత్యాధునిక సాంకేతికతలను ప్రదర్శించనున్నారు. పరిశ్రమలు, పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతల మధ్య నేరుగా భాగస్వామ్యాలకు ఇది వేదిక కానుంది. వ్యూహాత్మక సదస్సులో 65కు పైగా సెషన్లలో 300 మంది ముఖ్య వక్తలు (మంత్రులు, విధాన నిర్ణేతలు, సీఈఓలు) పాల్గొని ఇంధన భద్రత, సరఫరా వ్యవస్థలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలపై చర్చిస్తారు. సాంకేతిక సదస్సులో 45కు పైగా సెషన్లలో 250 మంది నిపుణులు పాల్గొని ఇంధన పరివర్తనకు అవసరమైన నూతన సాంకేతికతలు, వినూత్న మార్గాలను వివరించనున్నారు.

ప్రపంచ నేతలు, ఇంధన దౌత్యం

అమెరికా, యూరోప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్ దేశాల మంత్రులు, అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ప్రముఖ ఇంధన కంపెనీల సీఈఓలు హాజరుకానుండటంతో, ఇది అంతర్జాతీయ ఇంధన దౌత్యానికి కీలక వేదికగా నిలవనుంది. అణుశక్తి, సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్, హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం, బయోఫ్యూయల్స్, ఎల్ఎన్‌జీ, పెట్రోకెమికల్స్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, డిజిటలైజేషన్-ఏఐ, మేకిన్ ఇండియా, నెట్ జీరో వంటి 11 ప్రత్యేక జోన్లుగా ప్రదర్శనను విభజించారు. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ, భారత పెట్రోలియం పరిశ్రమల సమాఖ్య (ఎఫ్ఐపీఐ), డీఎంజీ ఈవెంట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వారోత్సవం ద్వారా 2026లో ప్రపంచ ఇంధన కార్యాచరణకు దిశానిర్దేశం చేసే కీలక వేదికగా భారత ఇంధన వారోత్సవం-2026 నిలవనుందని నిర్వాహకులు తెలిపారు. మరింత సమాచారం కోసం https://www.indiaenergyweek.com/ సందర్శించవచ్చు.

Next Story