ప్రపంచ దేశాలతో భారత్ స్నేహ హస్తం.. కెనెడా కీలక నిర్ణయం

by Muthe.Rajitha |

భారత్-కెనెడా మధ్య నెలకొన్న దౌత్య పరమైన ప్రతిష్టంభనకు త్వరలోనే తెర పడనుంది.

ప్రపంచ దేశాలతో భారత్ స్నేహ హస్తం.. కెనెడా కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : గత రెండేళ్లుగా భారత్-కెనడా దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన అడ్డు తెరలు ఎట్టకేలకు వీడుతున్నాయి. జస్టిన్ ట్రూడో హయాంలో తీవ్రస్థాయికి చేరిన ఉద్రిక్తతలు, ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ హయాంలో స్నేహపూర్వక దిశగా అడుగులు వేస్తున్నాయి. భారత ప్రభుత్వంపై గతంలో చేసిన తీవ్రమైన ఆరోపణలను తాజాగా కెనడా అధికారులు అధికారికంగా వెనక్కి తీసుకోవడం ఈ మార్పుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలు పునరుద్ధరించడమే కాకుండా, ఫిబ్రవరి 28న ప్రారంభం కానున్న ప్రధాని మార్క్ కార్నీ భారత పర్యటనకు గట్టి పునాది వేసింది.

భారత్ - కెనెడా వివాదం నేపథ్యం

2021లో కెనడాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విదేశీ శక్తులు, ముఖ్యంగా భారత్ జోక్యం చేసుకుందంటూ అప్పటి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది. అంతర్గత రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఒక స్వతంత్ర దర్యాప్తు కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. అయితే భారత్ ఈ ఆరోపణలను అప్పట్లోనే తీవ్రంగా ఖండించింది. ఏ దేశ అంతర్గత వ్యవహారాల్లో, ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకోవడం తమ విదేశీ విధానం కాదని స్పష్టం చేసింది. తాజాగా.. కెనడా ఎన్నికలను పర్యవేక్షించిన ఒక సీనియర్ అధికారి సదరు కమిషన్ ముందు హాజరై, భారత ప్రభుత్వం ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నం చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పడంతో ట్రూడో హయాం నాటి ఆరోపణలకు తెరపడింది.

కార్నీ స్నేహ హస్తం

ప్రస్తుత మార్క్ కార్నీ ప్రభుత్వం ఈ విషయంలో అత్యంత పరిణతితో వ్యవహరిస్తోంది. ఎన్నికల జోక్యం అంశంపై స్పందించిన కెనడా ఉన్నతాధికారి ఒకరు, తమ దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో భారత్ జోక్యం చేసుకుందన్న విషయాన్ని తాము ఏమాత్రం విశ్వసించడం లేదని మీడియాకు వెల్లడించారు. "ఒకవేళ భారత్ జోక్యం ఉందనే అనుమానం మాకు ఉంటే, మా ప్రధానమంత్రి భారత్ పర్యటనకు వెళ్లే అవకాశమే ఉండేది కాదు" అని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈ అంశంపై ఇప్పటికే భారత ప్రభుత్వంతో సమగ్ర చర్చలు జరిపామని, విదేశీ జోక్యాన్ని నివారించేలా తమ వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు ఉన్నాయని కెనడా ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది. ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, భారత్‌తో సంబంధాలను 'రీసెట్' చేయాలనే కెనడా దృఢ నిశ్చయానికి సంకేతం అని తెలుస్తోంది.

ఆర్థిక-వ్యూహాత్మక ప్రయోజనాలే లక్ష్యం

ప్రధాని మార్క్ కార్నీ భారత పర్యటనలో వాణిజ్యం, రక్షణ, క్లీన్ ఎనర్జీ రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. గతంలో నిలిచిపోయిన చర్చలను మళ్లీ పట్టాలెక్కించడం ద్వారా ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయాలని కార్నీ భావిస్తున్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం వంటి అంశాలపై గతంలో ఉన్న విభేదాలను పక్కన పెట్టి, పరస్పర భద్రతా సహకారంపై దృష్టి సారించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం. ముఖ్యంగా ఇండో-పసిఫిక్ రీజియన్‌లో పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి భారత్ వంటి పెద్ద ప్రజాస్వామ్య దేశంతో స్నేహం కెనడాకు అత్యంత అవసరం.

ఆరోపణల నుండి అన్యోన్యత వైపు

మొత్తానికి ఆరోపణల నుండి అన్యోన్యత వైపు సాగుతున్న భారత్-కెనెడా ప్రయాణం అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా నిలవనుంది. మార్క్ కార్నీ రాకతో భారత్-కెనడా సంబంధాలు మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటాయని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Next Story