IND vs NZ ఫైనల్.. అహ్మదాబాద్‌లో 'హై-వోల్టేజ్' పిచ్ సిద్ధం.. భారీ స్కోరు గ్యారంటీ!

by Malleboina Mahesh |

అహ్మదాబాద్‌లో 70% ఎర్ర మట్టి, 30% నల్ల మట్టితో హై-బౌన్స్ పిచ్ సిద్ధం! భారీ స్కోర్లకు ఛాన్స్.. టాస్ గెలిచిన జట్టుకు డ్యూ (Dew) అడ్వాంటేజ్?

IND vs NZ ఫైనల్.. అహ్మదాబాద్‌లో హై-వోల్టేజ్ పిచ్ సిద్ధం.. భారీ స్కోరు గ్యారంటీ!
X

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ (T20 World Cup) ఫైనల్ మ్యాచ్ ఈ రోజు సాయంత్రం జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్-న్యూజిలాండ్ (India-New Zealand) మధ్య ఫైనల్ పోరుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium) సర్వం సిద్ధమైంది. ఈ మెగా ఫైనల్ కోసం క్యూరేటర్లు ప్రత్యేకంగా 'మిక్స్‌డ్ సాయిల్' (70% ఎర్ర మట్టి, 30% నల్ల మట్టి) పిచ్‌ను రూపొందించినట్లు సమాచారం అందుతుంది. ఈ విలక్షణమైన మట్టి మిశ్రమం కారణంగా బౌలర్లకు మంచి బౌన్స్ లభించడమే కాకుండా, పేసర్లకు ఆరంభంలో అనుకూలిస్తుందని పిచ్ రిపోర్ట్ చెబుతోంది. అయితే, బ్యాటర్లకు కూడా ఈ పిచ్ స్వర్గధామంలా మారనుందని, స్టేడియంలో పరుగుల వరద పారడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గతంలో ఇదే పిచ్‌పై జరిగిన దక్షిణాఫ్రికా వర్సెస్ కెనడా (ఫిబ్రవరి 9) మ్యాచ్ గణాంకాలను పరిశీలిస్తే, మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 213/4 పరుగుల భారీ స్కోరు సాధించి 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ రికార్డును బట్టి చూస్తుంటే ఫైనల్ మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. అయితే, రాత్రి పూట 'మంచు' (Dew) ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, టాస్ గెలిచిన జట్టుకు బౌలింగ్ ఎంచుకోవడం కలిసొచ్చే అంశం. రెండో ఇన్నింగ్స్‌లో బంతిని పట్టుకోవడం బౌలర్లకు కష్టతరంగా మారే అవకాశం ఉండటంతో టాస్ ఇక్కడ అత్యంత కీలకంగా మారింది.

మూడో ప్రపంచ కప్ టైటిల్ లక్ష్యంగా భారత్

నేడు భారత్ తన మూడో ప్రపంచ కప్ టైటిల్ లక్ష్యంగా.. డిఫెండింగ్ ఛాంపియన్, ఆతిధ్య జట్టుగా బరిలోకి దిగుతుంది. ఈ క్రమంలో అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందనే వార్తలతో స్టేడియం రికార్డు స్థాయిలో పరుగుల విందుకు వేదికవుతుందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఫామ్‌లో ఉండటం, అహ్మదాబాద్ పిచ్ బౌన్స్‌కు సహకరిస్తుండటంతో ఒక ఉత్కంఠభరితమైన పోరును చూడబోతున్నామనే నమ్మకం అందరిలోనూ వ్యక్తమవుతోంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఈ మహా సంగ్రామంలో పిచ్ ఎవరికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందో తెలియాలంటే మ్యాచ్ ప్రారంభం అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Next Story