- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్కారుపై నమ్మకం.. రాష్ట్రంలో పెరిగిన మద్యం అమ్మకాలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పారదర్శక విధానాల వల్ల మద్యం అమ్మకాలు పెరిగాయి. 'సురక్ష' యాప్, 5 ల్యాబ్‌ల ద్వారా క్వాలిటీని పరీక్షిస్తున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: కోరుకున్న బ్రాండ్లు, అందులోనూ నాణ్యమైన మద్యం..అక్రమ రవాణా కట్టడి..ఎక్సైజు శాఖలో అవినీతికి అడ్డుకట్టతో రెండేళ్ల కూటమి ప్రభుత్వంలో అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఎక్సైజ్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ పారదర్శకత, నాణ్యత, టెక్నాలజీ ఆధారిత విధానాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేయడంతో ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గత 23 నెలల్లో ఎక్సైజ్ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే ఇందుకు కారణమని ఎక్సైజు శాఖ చెబుతోంది.
గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, అనుమానాలు నెలకొన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కల్తీ మద్యం, అక్రమాలు, నగదు లావాదేవీలు వ్యవస్థను దెబ్బతీశాయని ప్రభుత్వం విమర్శించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు... స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(సెబ్)ను రద్దు చేసి ఎక్సైజు శాఖను ఏకీకృతం చేయడంతో పాటు మద్యం కుంభకోణాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది.
కొత్త ఎక్సైజ్ పాలసీ..
చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. 2024-26 నూతన మద్యం విధానంలో భాగంగా లాటరీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపుల కేటాయింపు చేపట్టగా దాదాపు 90 వేల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల రూపంలోనే ప్రభుత్వానికి రూ.1800 కోట్ల ఆదాయం సమకూరింది. మరో వైపు ఎన్నికల హామీ మేరకు 10 శాతం దుకాణాలు కల్లుగీత కార్మికులకు కేటాయించారు.
డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహం..
మద్యం విక్రయాల్లో పారదర్శకత పెంచేందుకు డిజిటల్ చెల్లింపులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ చర్యతో గతంలో కేవలం 0.6 శాతం మాత్రమే ఉన్న డిజిటల్ లావాదేవీలు ప్రస్తుతం 45 శాతానికి చేరాయి. ట్రాక్ అండ్ ట్రేస్ విధానంతో డిస్టిలరీల నుంచి షాపుల వరకు ప్రతి మద్యం బాటిల్‌ను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షణ చేస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారులు బాటిల్ వివరాలు తెలుసుకునేందుకు ' సురక్ష' యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
13 రకాల నిర్థారణ పరీక్షలు..
రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, చిత్తూరు, కర్నూలులో అత్యాధునిక ల్యాబ్‌లు ఏర్పాటు చేసి ప్రతి మద్యం బ్యాచ్‌పై 13 రకాల పరీక్షలను ఎక్సైజ్ శాఖ నిర్వహిస్తోంది. గతంలో ఏటా 14 వేల పరీక్షలు మాత్రమే జరిగేవి. ప్రస్తుతం నెలకు సగటున 30 వేల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
రూ.99కే మద్యం..
అక్రమ రవాణా, నాటు సారా నియంత్రణ కోసం ప్రీమియం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు రూ.99 మద్యం బ్రాండ్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రంలో పదకొండు ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేశారు.
ఈగిల్ టీమ్స్ ఏర్పాటు..
గంజాయి నిర్మూలన కోసం 'ఈగిల్ టీమ్స్' ఏర్పాటు చేశారు. ఇందుకోసం మద్యం ఆదాయం లో 2 శాతం నిధులను ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మద్యం దుకాణాల్లో సీసీ కెమెరాలను 'ఎక్సైజ్ ఐ' యాప్‌తో అనుసంధానం చేసి పర్యవేక్షణను కట్టుదిట్టం చేశారు.
గత ప్రభుత్వంలో అనేక లోపాలు..
గత ప్రభుత్వ హయాంలో నాణ్యమైన బ్రాండ్లను తొలగించి వినియోగదారులపై బలవంతపు బ్రాండ్ వ్యవస్థను మోపినట్లు ప్రభుత్వం ఆరోపించింది. నగదు లావాదేవీల ద్వారానే ఎక్కువగా విక్రయాలు జరిగాయని, అక్రమ రవాణా పెరిగిందని విమర్శించింది. మద్యం విధానాల కారణంగా మహిళలపై వేధింపులు, కాలేయం, కిడ్నీ సమస్యలు పెరిగినట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలను ప్రభుత్వం ప్రస్తావించింది.
ప్రజారోగ్యానికి పెద్దపీట..
రాష్ట్రంలో ఎక్సైజ్ వ్యవస్థలో పారదర్శకత, నాణ్యత, ప్రజారోగ్య రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రతి దశలో మద్యం నాణ్యతను పరీక్షిస్తున్నామని, బ్రాండ్ మిక్సింగ్, అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. డిజిటల్ లావాదేవీలు పెరగడం ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.






