- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెరిగిన భూముల ధరలు.. భారంగా మారిన రిజిస్ట్రేషన్ చార్జీలు!
రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నాలుగేళ్ల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలను స్థిరికరించింది.

దిశ, కొత్తగూడెం ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నాలుగేళ్ల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలను స్థిరికరించింది. బీఆర్ఎస్ హయాంలో రెండు సార్లు ధరలు పెంచగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తొలిసారి భూముల ధరలను పెంచింది. దీంతో ప్రభుత్వానికి ఇబ్బడిముబ్బడిగా ఖజానాకు ఆదాయం వచ్చిపడనుంది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడం, అందులో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు వీలుగా ఉన్న ప్రాంతాలు కేవలం 6 నుంచి 10మండలాలే ఉండటం, ప్రస్తుతం పెంచిన భూముల ధరలకు రెక్కలు రావడంతో క్రయవిక్రయాలు కొంత మందగమనంలో పయనించనుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
భూములు, ఇండ్ల ధరలకు రెక్కలు..
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 30 శాతం నుంచి 75 శాతం వరకు భూముల ధరలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం పెంచింది. జిల్లాలోని 23 మండలాల్లో భూములు, ఇండ్లు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉన్న మండలాలు కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్, దమ్మపేట, అశ్వారావుపేట, ఇల్లెందు, భద్రాచలం, బూర్గంపాడు ఉన్నాయి. ప్రధానం కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో ఉన్న కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్, దమ్మపేట, అశ్వారావుపేట, ఇల్లెందులలోనే ఎక్కువగా క్రయవిక్రయాలు జరుగుతాయి. ఇక భద్రాచలం, బూర్గంపాడు మండలంలో ప్రతి రోజు పదుల సంఖ్యలోనే మాత్రం రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.
భూముల ధరల పెరుగుదల విషయానికి వస్తే కొత్తగూడెం పట్టణంలోని భూములు, ప్లాట్ ధరలను దాదాపు 25శాతం నుంచి 30శాతం వరకు పెంచారు. పట్టణంలోని ప్రధాన రోడ్ వెంట కమర్షియల్ ఏరియాలలో గతంలో రూ.29,900 ఉండగా ప్రస్తుతం రూ.37,400 అంటే 25శాతం, ఆపార్టుమెంట్లలో చదరపు అందుకు రూ.2,800లకు గాను ప్రస్తుతం రూ.3,400కు పెంచారు. ఇక ప్రధాన రోడ్ను ఆనుకొని ఉన్న కూలీలైన్ ఏరియాలో భూముల ధరలు గజానికి రూ.26,400 ఉంటే ప్రస్తుతం రూ. 33 వేలకు పెంచారు. ఇక సుజాతనగర్ ప్రధాన రోడ్ వెంట ఉన్న భూములకు రూ.2,400 నుంచి 4,200లకు అంటే 80 శాతం పెంచారు. పాల్వంచ పట్టణంలో గాంధీనగర్, కిన్నెరసాని రోడ్, ప్రధాన రోడ్డు వెంట దాదాపుగా 30 నుంచి 50 శాతం పెంచారు. ఇక మున్సిపాలిటీగా మారిన అశ్వారావుపేటను భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అశ్వారావుపేట- ఖమ్మం రోడ్డు, అశ్వారావుపేట - జంగారెడ్డి గూడెం రోడ్ వెంట ఉన్న కమర్షియల్ ఏరియాలో 35 నుంచి 50 శాతం పెంచారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న మారుతీ నగర్ ఏరియాలో 50 శాతం ధరలు పెంచారు. ఇక అబ్బుగూడెం పరిధిలోని భూముల విలువను 100 శాతం పెంచారు. ఇక ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో 25 శాతం పెంచగా, ఏజెన్సీ మండలాలైన భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో కేవలం గిరిజనులు మాత్రమే వారి భూములను రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు ఉంది కనుక అక్కడ కూడా 25 శాతం వరకు పెంచారు.
భారంగా మారిన రిజిస్ట్రేషన్ చార్జీలు..
రాష్ట్ర ప్రభుత్వం భూముల ధరలు పెంచి, స్టాంప్ డ్యూటీ ఛార్జీలను పెంచకపోయినప్పటికీ కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ చార్జీలు భారంగా మారాయి. స్టాంప్ డ్యూటీ చార్జీలకు సేల్ డీడ్ అయితే 7.5శాతం, గిఫ్ట్ డీడ్ అయితే 3 శాతంగా ఉంది. గతంలో 100 గజాల నుంచి 200 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆయా ప్రాంతాన్ని బట్టి రూ.40వేల నుంచి రూ. 1లక్ష వరకు ఉండేది. కానీ ప్రస్తుతం పెరిగిన భూముల ధరల, ప్లాట్ ధరలతో దాదాపు రూ.2 లక్షలకు పైగానే ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. రేట్లు పెరుగుతున్నాయని ప్రభుత్వం ముందే సమాచారం ఇవ్వడంతో పాత రేట్ల ప్రకారమే అనేక మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ప్రభుత్వం కూడా 15 రోజుల ముందుగానే సమాచారం ఇవ్వడంతో పాటు రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్‌లను 48 ఉంచి 96కు పెంచడం, రిజిస్ట్రేషన్ కార్యాలయం పనివేళలు సైతం పెంచడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం యధావిధిగానే ప్రతీరోజు 48 స్లాట్ బుకింగ్‌లను కొనసాగిస్తుండగా శుక్ర, శనివారాలలో 20 నుంచి 30 మాత్రమే రిజిస్ట్రేషన్ల సంఖ్య నమోదైంది.
అమ్మేవారు ఉన్న.. కొనేవారేరీ!
ప్రస్తుతం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రియాలిటీ రంగం కొంత మందగించిందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. భూములు, ఇండ్లు అమ్మేవారు ఉన్నప్పటికీ కొనేవారు లేక గత సంవత్సర కాలంగా రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తోందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుతం పెరిగిన భూముల ధరలతో ఇప్పట్లో కోలుకునే పరిస్థితి దరిదాపుల్లోనే లేదంటున్నారు. భద్రాద్రి జిల్లాలో ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతం ఉండటం దీనికి తోడు రిజిస్ట్రేషన్ ఏరియాలు కూడా తక్కువగా ఉండటం కొంత ఇబ్బందికరంగా మారింంటున్నారు. రిజిస్ట్రేషన్ భూములు, ఇండ్లు, ప్లాట్లు ఉన్నప్పటికీ అమ్మకాలు చేసేవారు చెప్పే రేటుకు కొనుగోలుదారులు గుండె బేజారవుతోంది. ఇప్పుడు ఆమాంతం భూముల ధరలు పెంచడం ఇక రియల్ రంగం కుదేలవుతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు.
కొనుగోలుదారుల్లో ఆసక్తి తగ్గిపోతుంది:సలీం (రియల్ ఎస్టేట్ వ్యాపారి)
కొత్తగూడెం పట్టణం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటేనే ఏ పట్టణమైన డెవలప్ అవుతుంది. ఇక్కడ గతంలో భూములపై, ఇండ్లపై ఎటువంటి యాజమాన్య హక్కులు ఉండేవి కావు. ఇండ్లు, స్థలాలు కొనుగోలు చేయాలనుకునే వారు సుజాతనగర్, పాల్వంచ, కొంతమంది ఉద్యోగులు ఖమ్మం, హైదరాబాద్ లాంటి ప్రాంతాల వైపు పెట్టుబడి పెట్టి కొనేవాళ్ళు. కొత్తగూడెం పట్టణానికి జీవో నెంబర్ 76 ద్వారా ఇంటి పై హక్కులు కల్పించడంతో ఒక్కసారిగా రిజిస్ట్రేషన్లు పెరిగాయి. కొనుగోలుదారులు కూడా కొత్తగూడెంలోనే కొనేందుకు ఆసక్తి చూపారు. ప్రస్తుతం 76 జీవో ఆగిపోయింది. ఇప్పుడు భూములు, ఇండ్ల ధరలు పెంచడంలో మళ్ళీ కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం కోలుకోవాలంటే కొంత సమయం పట్టవచ్చు.






