పుష్ప పోలీసును తలపిస్తున్న కరీంనగర్ కానిస్టేబుల్..

by Disha Web Desk 19 |
పుష్ప పోలీసును తలపిస్తున్న కరీంనగర్ కానిస్టేబుల్..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఖాకీ పాయింటు, తెల్లని షర్టు, భుజాన వాకీటాకీ పెట్టుకుని ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్నాడో కానిస్టేబుల్. ప్రధాన కూడళ్లలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన చేతి సైగలు చేస్తూ వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. అతన్ని చూసిన వాహనదారులు ఓ క్షణం స్లో అయి అతన్ని తేరిపారా చూస్తూ వెలుతున్నారు. తనను వింతగా చూస్తున్నారేంటీ జనం? తనలో ఉన్న వైవిద్యం ఏంటో అర్థం కాలేదు ఆయనకు మొదట్లో. క్రమ క్రమంగా పుష్ప సినిమాలో పోలీసు అధికారి రోల్‌లో నటించిన యాక్టర్‌లా ఉన్నాడంటూ జనం కామెంట్ చేయడంతో అసలు విషయం తెలిసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు.

ఆ తరువాత ఒక్కొక్కరూ వచ్చి సెల్ఫీలు కూడా దిగుతుండడంతో ఆయనకు కామన్‌ అయిపోయింది. పుష్ప మూవీలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో బన్వర్ సింగ్ షెకావత్‌గా కేరళ నటుడు ఫహద్ ఫాసిల్ నటించిన విషయం తెలిసిందే. అందులో మెయిన్ పోలీస్ క్యారెక్టర్ పేరు భన్వర్ సింగ్ షేకావత్ నున్నని గుండు పెద్ద సైజు మీసాలతో తనదైన శైలిలో ఉండే డైలాగులతో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో జీవించాడు ఫాసిల్. అందులో హీరో అల్లు అర్జున్‌తో కొట్టే ఓ డైలాగ్ ఉంది.. అదే " పార్టీ లేదా పుష్ప" అన్న డైలాగ్ మీమ్స్‌లోనూ ట్రెండింగ్‌లో ఉంది.

కరీంనగర్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శ్రీనివాస్ అలియాస్ బుల్లెట్ సీను రకరకాల హెయిర్ స్టైల్స్‌, మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తుంటాడు. ఏడేళ్లుగా నున్నని గుండు, భారీ సైజ్ మీసాలతో ఉంటున్న శ్రీనివాస్ ను ఇంతకాలం ఎవరూ పట్టించుకోలేదు కానీ.. పుష్ప సినిమా విడుదలైన తరువాత బుల్లెట్ సీను ఫేంగా మారిపోయాడు. మూవీలో పోలీస్ పాత్రలో నటించిన ఫాసిల్‌లా ఉండడంతో అతన్ని చూసి షాక్ అవుతున్నారు కరీంనగర్ జనం. భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ వేసిన నటున్ని పోలినట్టుగానే శ్రీనివాస్ ఉండడంతో ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు.

ఆయన డ్యూటీ చేస్తున్న ప్రాంతాల్లో వెల్లే వారు బుల్లెట్ సీనుతో సెల్ఫీలు దిగుతున్నారు. వాస్తవంగా తాను పుష్ప సినిమాకంటే ముందు నుండే అంటే ఏడేళ్ల క్రితం నుండే నున్నని గుండు, మీసంతో తిరుగుతున్నానని, ఇప్పుడు పుష్పలో నటునితో పోలుస్తున్నారన్నారు. 1992 బ్యాచ్‌కు చెందిన శ్రీనివాస్ జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఎక్కువ కాలం పనిచేశారు. ఇటీవలే కరీంనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా బదిలీపై వచ్చారు. పుష్పలో పోలీసు ఆఫీసర్ పాత్రతో తనను ఫేమస్ చేసేస్తున్నారని అంటున్నారు శ్రీనివాస్. ఈ విషయం తెలిసి తన బాసులు కూడా వెరీ గుడ్ లుక్కింగ్ అంటూ అభినందిస్తున్నారని శ్రీనివాస్ ''దిశ'' ప్రతినిధికి వివరించారు.



Next Story