పిల్లల మానసిక ఆరోగ్యంపై మహమ్మారి ప్రభావం.. తాజా అధ్యయనం

by Disha Web Desk 7 |
పిల్లల మానసిక ఆరోగ్యంపై మహమ్మారి ప్రభావం.. తాజా అధ్యయనం
X

దిశ, ఫీచర్స్ : కరోనా మహమ్మారి పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కొవిడ్ టైమ్‌లో తలనొప్పితో బాధపడిన చాలామంది పీడియాట్రిక్ పేషెంట్లు తరచుగా నొప్పిని అనుభవిస్తూ ఆందోళనకు గురవడమే ఇందుకు కారణమని పేర్కొంది. చైల్డ్ న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధనలో.. పాండమిక్‌లో రోజువారీ జీవితంలో ఏర్పడిన అంతరాయాలు, సోషల్ డిస్టెన్స్ పద్ధతులు, తమతో పాటు ఇతరుల వల్ల కలిగే అనారోగ్య ముప్పుతో ముడిపడిన ఒత్తిడి వల్ల కలిగే తలనొప్పి సమస్యలు పిల్లల జీవన నాణ్యతను ప్రభావితం చేస్తున్నాయని తేలింది.

మైగ్రేన్, ఇతర తలనొప్పి కారకాలు పిల్లల్లో చాలా సాధారణం. ఈ అధ్యయనం కోసం 107 మంది పేషెంట్లలో తలనొప్పి లక్షణాలు, జీవనశైలి కారకాల్లో మార్పులను పరిశీలించారు. పాండమిక్‌కు ముందు 60% మంది రోగులు, నెలలో 15 కంటే తక్కువ రోజులు తలనొప్పితో బాధపడుతుండగా.. మహమ్మారి తర్వాత ఆ సంఖ్య 50%కి పడిపోయిందన్నారు. దాంతోపాటు ప్రతి రోజు తలనొప్పితో గుబులు చెందే పేషెంట్లు మహమ్మారికి ముందు 22% నుంచి 36% వరకు ఉండగా.. కరోనా ప్రారంభమయ్యేసరికి 49% మంది పేషెంట్లలో తలనొప్పులు తీవ్రమయ్యాయని సర్వేలో తేలింది. దీని కారణంగా వారి శారీరక శ్రమ స్థాయిలు తగ్గాయని 54% మంది రోగులు నివేదించారు.

భవిష్యత్తులో జనాభా ఆధారిత అధ్యయనాలు.. తలనొప్పితో బాధపడుతున్న పిల్లలపై ఈ మహమ్మారి ప్రభావాలను మరింతగా వివరిస్తాయి. కాబట్టి ఈ సమయంలో.. పాండమిక్ వారిలో తలనొప్పి, మానసిక స్థితిని ఎలా ప్రభావితం చేసిందన్న విషయమై తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలని.. ఇంట్లో లేదా పిల్లల మనస్తత్వశాస్త్రంలో శిక్షణ పొందిన నిపుణులతో సాయమందించాలని ఈ అధ్యయన రచయిత డాక్టర్ డిసబెల్లా సిఫార్సు చేస్తున్నారు.


Next Story