- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్‌నీనో ప్రభావం.. ఆరుతడి పంటలే రైతులకు రక్షణ కవచం
ఎల్‌నీనో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతులు సంప్రదాయ నీటి ఆధారిత పంటలకు బదులుగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు.

దిశ, కోదాడ : ఎల్‌నీనో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతులు సంప్రదాయ నీటి ఆధారిత పంటలకు బదులుగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకుని, ఇప్పటికే సాగులో ఉన్న పత్తి, కంది, పెసర, బొబ్బర్లు వంటి పంటల్లో అంతర పంటలు వేసి పెట్టుబడి భారం తగ్గించుకోవడంతో పాటు అదనపు ఆదాయం పొందాలని రైతులకు సూచించారు. మంగళవారం కోదాడ మండలంలోని అల్వలపురం రైతు వేదికలో ఎల్‌నీనో ప్రభావంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. అల్పపీడన ద్రోణి ప్రభావం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సెప్టెంబర్ నెలలో కూడా గణనీయమైన వర్షాలు కురిసే అవకాశాలు కనిపించడం లేదన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఎగువ రాష్ట్రాల్లోనూ వర్షపాతం తక్కువగా నమోదవుతుండటంతో ప్రధాన జలాశయాలు నిండే పరిస్థితులు కనిపించడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకుని సాగు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
సజ్జలు, కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాల సాగుకు ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తోందని, ఉద్యాన పంటలు, కూరగాయల సాగుకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న బిందు సేద్య పరికరాలను వినియోగించుకోవడం ద్వారా తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. బోర్లు, ఎత్తిపోతల పథకాల కింద సాగు చేపట్టే రైతులకు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు శాస్త్రీయ పద్ధతులపై పూర్తి స్థాయిలో మార్గనిర్దేశం చేస్తారని చెప్పారు. ఆయిల్‌పామ్ సాగు రైతులకు స్థిరమైన ఆదాయ వనరుగా మారుతోందని, ఈ పంటకు పురుగుల బెడద, ఎల్‌నీనో ప్రభావం, కోతుల వల్ల నష్టం వంటి సమస్యలు తక్కువగా ఉంటాయని వివరించారు. రైతు నేస్తం ద్వారా అందిస్తున్న ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటే వ్యవసాయం మరింత లాభదాయకంగా మారి రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ చైర్మన్ కుసుమ, ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ సంతోష్ కిరణ్, ఎంపీడీవో ఇస్సాకు హుస్సేన్, వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.






