- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వే బిల్లు ఒక్కటి... ట్రిప్పులు పది
సిరిసిల్ల మానేరులో ఇసుక మాఫియా దందా! ఒక్క వే-బిల్‌తో పదుల సంఖ్యలో ట్రిప్పులు.. అధికారుల కక్కుర్తితో ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : కంచె చేను మేసే చందంగా అక్రమార్కులను అడ్డుకోవాల్సిన ఉద్యోగులే ఇసుక అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు. సక్రమంగా తరలించవలసిన ఇసుకను చేతివాటం చూపి అక్రమంగా తరలిస్తున్నారు. మానేరు వాగులో లబ్ధిదారులు అవసరం మేరకు ప్రభుత్వం ఇసుకకు అనుమతి ఇచ్చింది. కానీ కొందరు ఉద్యోగులు ఒకటే వే బిల్ ఉన్నప్పటికీ ఎక్కువ ట్రిప్పులు అనుమతి ఇస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది కాసులకు కక్కుర్తి పడి సహకరిస్తుండటంతో ఇసుక మాఫియా దందా జిల్లాలో మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతోంది.
అనుమతులు ఇలా
మానేరు వాగు నుంచి ఇసుక తీయడానికి జిల్లా కేంద్రంలోని సాయి నగర్ అయ్యప్ప గుడి పక్కన ప్రభుత్వం ఇసుక రీచ్ ఏర్పాటు చేసింది. ఈ రీచ్ నుంచి నెలకు దాదాపు అవసరాన్ని బట్టి ప్రభుత్వ, ప్రైవేటు పనులకు సమానంగా 4 నుంచి 6 సార్లు ఇసుక తీయడానికి అధికారులు అనుమతులు కల్పిస్తున్నారు. దానికి డీడీ రూపంలో డబ్బులు చెల్లిస్తే, ప్రభుత్వం వే బిల్లుల రూపంలో అనుమతులు ఇస్తుంది. ఇందిరమ్మ ఇండ్లకు అయితే వే బిల్లులు పూర్తిగా ఉచితం. ప్రభుత్వ, ప్రైవేటు పనులకు ఒక్కొక్క ట్రాక్టర్ ట్రిప్పుకు సుమారు రూ.500 డీడీ రూపంలో చెల్లిస్తే, ఒక్క ట్రాక్టర్ కు నాలుగు ట్రిప్పులకు మాత్రమే అనుమతిస్తారు. అది కూడా అనుమతి రోజున ఉదయం 10:30 గంటల నుంచి 3:30 గంటల వరకే అనుమతి ఉంటుంది. ప్రభుత్వం సాయినగర్ ఇసుక క్వారీలో ఇసుక రవాణాకు అనుమతి కల్పించిన ప్రతిసారి దాదాపు 130 నుంచి 150 ట్రాక్టర్లు అనుమతి పొందుతాయి. ఒక్కో ట్రాక్టర్ కు నాలుగు ట్రిప్పులు అనుమతి తీసుకున్న దాదాపు 500 ట్రిప్పుల ఇసుక రవాణా మానేరు వాగు నుంచి ఆరోజు రవాణా జరుగుతుంది. దాదాపు ప్రభుత్వానికి రూ.70 వేల ఆదాయం వస్తుంది.
రూ. 500 కొట్టు.. ఇసుక ట్రిప్పు పట్టు..
ఇసుక అక్రమంగా తరలించకుండా పర్యవేక్షణ చేసేందుకు ప్రభుత్వం రెవెన్యూ, పోలీస్ ఉద్యోగులను ఇసుక రిచ్ వద్ద ఏర్పాటు చేసింది. ఎవరు ఎన్ని ట్రిప్పులు తీసుకెళ్తున్నారో చూస్తూ పక్కదారి పట్టకుండా వీరి వీధి. అయితే పేరు పెరుమాండ్లది ఆరగింపు అయ్యగార్లది అన్న చందంగా తయారయింది సిరిసిల్ల మానేరు వాగు పరిస్థితి. రీచ్ వద్దకు విధులు నిర్వర్తించటానికి వచ్చిన రెవెన్యూ, పోలీస్ ఉద్యోగులతో పాటు ఆయా శాఖలకు సంబంధించిన ఉద్యోగులకు ఇసుక మాఫియా డబ్బులు ఎరచూపి అక్రమ ఇసుక దందాకు పాల్పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు ఒక్కో ట్రిప్పుకు రూ.500 తీసుకుని అనుమతుల ఇసుక పక్కదారి పట్టడానికి సహకరిస్తున్నట్లు వాదనలు లేకపోలేదు.
ఇసుక మాఫియా దారులకు సంబంధించిన దాదాపు 50 కి పైగా ట్రాక్టర్లు రీచ్ లో అనుమతి కల్పించిన రోజు దాదాపు ఒక్కో ట్రాక్టర్ కు నాలుగు నుంచి ఆరు ట్రిప్పుల ఇసుకను పక్కదారి పట్టిస్తున్నట్లు తెలిసింది. అంటే ఒక్కరోజు ఉద్యోగుల అక్రమ ఇసుక రవాణా ఆదాయం రూ.30000 అంటే మానేరు నుంచి ఎంత ఇసుక అక్రమంగా తరలిపోతోంది తెలుస్తోంది. ఇటీవల ఇసుక రీచ్ వద్ద విధులు నిర్వర్తించిన కానిస్టేబుల్ కు అవినీతి ఆరోపణలతో పోలీసు ఉన్నతాధికారి మెమోలు జారీ చేసినట్లు సమాచారం.
ఒక్క వే బిల్లుపై పదుల సంఖ్యలో రవాణా
అధికారికంగా ప్రభుత్వ పనులకు ఇసుకను సరఫరా చేసేందుకు వే బిల్లు ద్వారా ఇసుకకు అనుమతి ఇచ్చింది. దీన్ని కొందరు అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుని, సిబ్బందికి ఆమ్యమ్యాలు సమర్పిస్తూ ఒక్క వే బిల్లు ద్వారా పదుల సంఖ్యలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నియంత్రించాల్సిన ఆయా శాఖల ఉద్యోగుల ఇసుకాసురులకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇలాంటి అక్రమాకులు వారికి సహకరిస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు మామూలుగా తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రకృతి వనరులను కొల్లగొడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకుని మానేరు వాగును అక్రమార్కుల నుండి కాపాడి, ఇసుక పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
పారదర్శకంగా ఇసుక రవాణా
ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా ఇసుక రవాణా జరుగుతుంది. ప్రభుత్వ ప్రైవేటు రంగాలకు సమానంగా అనుమతులు ఇస్తున్నాం. ఇసుక రీచ్ వద్ద రెవెన్యూ ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు మా దృష్టికి రాలేదు. ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే ఉన్నతాధికారుల సూచనలతో చర్యలు తీసుకోబడతాయి.- సురభి మహేష్ కుమార్ తహసీల్దార్ సిరిసిల్ల






