- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుంగభద్ర నదీ గర్భంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు
మంత్రాలయంలో ఇసుక మాఫియా ఆగడాలు! రాజకీయ పార్టీల 'అప్రకటిత కూటమి'తో తుంగభద్ర నది దోపిడీ. అధికారుల మామూళ్ల మత్తు, భూగర్భ జలాలు అడుగంటుతున్నా పట్టించుకోని వైనం.

దిశ, మంత్రాలయం: పుణ్యక్షేత్రం మంత్రాలయం లో ఆధ్యాత్మికత కంటే అక్రమ ఇసుక దందా శబ్దాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. తుంగభద్ర నది గర్భాన్ని గుల్ల చేస్తూ, ప్రకృతి సంపదను పక్కదోవ పట్టిస్తున్న ఇసుక మాఫియా ఆగడాలు మిన్నంటాయి. ఇక్కడ రాజకీయ రంగు ఏదైనా, దోపిడీలో మాత్రం అందరూ 'భాయ్ భాయ్' అన్నట్లుగా వ్యవహరిస్తుండటం స్థానికులను విస్మయానికి గురి చేస్తోంది.
రాజకీయ భేదాల్లేని 'ఇసుక' మైత్రి !
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులుగా తలపడే పార్టీలు, మంత్రాలయం ఇసుక రీచ్‌ల వద్దకు వచ్చేసరికి అప్రకటిత కూటమిగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు చేతులు కలిపి నది ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారు. రాత్రి వేళల్లో వందలాది ట్రాక్టర్లు నదీ తీరాన్ని ముట్టడిస్తూ, అక్రమంగా ఇసుకను తరలిస్తున్నాయి. ఈ వింత 'రాజకీయ పొత్తు' చూసి సామాన్య జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
జనజీవనం నరకం..
అర్ధరాత్రి వేళ ట్రాక్టర్ల మితిమీరిన వేగం, ఇంజిన్ల శబ్దాలతో గ్రామస్తులకు కంటిమీద కునుకు కరువైంది. ఇప్పటికే ఇరుకైన రోడ్లతో ఇబ్బంది పడుతున్న భక్తులకు, ఈ ఇసుక ట్రాక్టర్ల రాకతో ట్రాఫిక్ నరకం కనిపిస్తోంది. నదిలో ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేయడం వల్ల భూగర్భ జలమట్టం పడిపోయింది. నది పక్కనే ఉన్నా.. తాగడానికి చుక్క నీరు దొరకని దుస్థితిలో మండలం కొట్టుమిట్టాడుతోంది.
మామూళ్ల మత్తులో యంత్రాంగం?
అక్రమ రవాణా ఇంత బహిరంగంగా జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక 'పెద్ద' కథే ఉందని ప్రచారం సాగుతోంది. ఒక్కో ట్రాక్టర్ నుంచి నెలకు రూ.15,000 నుంచి రూ.20,000 వరకు మామూళ్లు అందుతున్నాయని, ఈ వసూళ్ల పర్వంలో కొందరు నేతలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ అధికారులకు వాటాలు పంచుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అప్పుడప్పుడు మొక్కుబడిగా చేసే తనిఖీలు, నామమాత్రపు జరిమానాలు కేవలం కంటితుడుపు చర్యలేనని స్పష్టమవుతోంది.
భక్తుల ఆవేదన.. అధికారుల మౌనం!
భక్తికి నిలయమైన మంత్రాలయం ఇప్పుడు అక్రమార్కులకు అడ్డాగా మారడంపై భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నదీ సంపదను కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులు మౌనం వహించడం వెనుక మర్మమేమిటో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఈ 'ఇసుక' దోపిడీకి అడ్డుకట్ట వేయాలని, పర్యావరణాన్ని కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






