గ్రామాల మధ్య హద్దులు పెట్టుకుని అక్రమ ఇసుక దందా

by Malleboina Mahesh |

ఇసుక దందా సెగలు! మానేరు వాగు ఇసుక తరలింపులో హద్దులు దాటారంటూ ఊటూర్, గట్టెపల్లి గ్రామస్తుల ఘర్షణ. అధికారుల అండతోనే అక్రమ తవ్వకాలని విమర్శలు.

గ్రామాల మధ్య హద్దులు పెట్టుకుని అక్రమ ఇసుక దందా
X

దిశ, కరీంనగర్ బ్యూరో : మానేరు వాగులో సహజ సిద్ధంగా నిక్షిప్తమైన ఇసుక రెండు సరిహద్దు గ్రామాల మధ్య అగాధం సృష్టిస్తుంది. మానేరు వాగులో ఇసుక నిల్వలను సరిహద్దు గ్రామలైన సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి మానకొండూర్ మండలం ఊటూర్ గ్రామాలకు చెందిన ట్రాక్టర్ యజమానులు ఇష్టానుసారంగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రెండు గ్రామాల మధ్య వివాదం తలెత్తకుండా హద్దులు సైతం నిర్ణయించుకుని ఇసుక తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఇసుకతరలింపులో హద్దులు దాటుతున్నారంటూ ఇరు గ్రామాల ట్రాక్టర్ యజమానులు ఘర్షణకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇసుక ట్రాక్టర్లను ఊటూర్ గ్రామానికి చెందిన వారు బలవంతంగా గ్రామంలోకి లాక్కెల్లడంతో ఇసుక దందా రెండు గ్రామాల మధ్య పంచాయితీకి కారణమైంది.

శృతి మీరుతున్న ట్రాక్టర్ యజమానులు

మానేరు శివారు గ్రామాలైన ఊటూర్, గట్టెపల్లి గ్రామాల్లో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ యజమానుల తీరు శృతిమించుతుంది అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మానేరు వాగులో సహజ సిద్ధంగా నిక్షిప్తమయిన ఇసుక ను సాండ్ టాక్స్ పేరుతో మైనింగ్ అధికారులు ఇసుకను తరలించేందుకు స్లాట్ బుకింగ్ విధానం ద్వారా ట్రాక్టర్ యజమానులకు ఇసుకను తరలించేందుకు అవకాశం కల్పిస్తుంటే ఇదే అదనుగా ట్రాక్టర్ యజమానులు ఉపాధి పేరిట ఇసుక పై సర్వహక్కులు తమకే ఉన్నాయి అన్నట్టుగా ట్రాక్టర్ యజమానులు వ్యవహరించడం వివాదాలకు కారణమవుతోంది. ఈ వివాదమే ప్రస్తుతం రెండు గ్రామాల మధ్య అగాధాన్ని సృష్టించి ఉద్రిక్త పరిస్థితికి కారణమైంది.

అక్రమానికి హద్దులు

మానేరు వాగు నుంచి సాండ్ టాక్స్ పేరిట ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ యజమానులు ఒక్క బుకింగ్ పై అక్రమంగా రెండు లేదా మూడు ట్రిప్పుల ఇసుకను నగరాలకు తరలిస్తున్నారు ట్రాక్టర్ యజమానులు. ఇసుక తరలింపు లాభదాయకంగా మారడంతో ఇసుక తరలింపును ఉపాధిగా మార్చుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే అక్రమ దందాను అరికట్టాల్సిన గ్రామ పాలకవర్గాలు పోలీసు శాఖలోని ఓ పోలీస్ అధికారిని పిలిపించి హద్దులు ఏర్పరచడం రెండు గ్రామాల మధ్య పంచాయితీకి కారణమైంది. . పెద్దల సమక్షంలో పెట్టుకున్న హద్దులు దాటారు అంటూ ఊటూర్ గ్రామ ట్రాక్టర్ యజమానులు గట్టెపల్లి ట్రాక్టర్ లను అడ్డుకోవడం బలవంతంగా ఊటూర్ గ్రామ పంచాయతీకి తరలించడం ఇప్పుడు రెండు జిల్లాల మధ్య పంచాయితీకి కారణమైంది.

మానేరు వాగులో ఏం జరుగుతుంది..

మానేరు వాగు ఒకప్పుడు పరిసర గ్రామాల్లో తాగు సాగు నీటిని అందించి సస్యశ్యామలం చేసింది. కాగా ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకునేందుకు మానేరు వాగులో నిక్షిప్తమయిన ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకోవడంతో మానేరు వాగులో ఇసుక తవ్వకాలతో బొందల గడ్డగా మారి గ్రామాలను కాలుష్యం కాటేస్తుంది. ఇసుక తవ్వకాలను అడ్డుకోవాల్సిన గ్రామ ప్రజలు అది విస్మరిస్తూ ఇసుక తరలించేందుకు ట్రాక్టర్లను కొనుగోలు చేసి ఇసుక తరలించేందుకు పెట్టుకుంటున్నారు. సాండ్ టాక్స్ పేరిట ఇసుకను తరలిస్తూ క్రమేణ అలావాటు పడ్డ ట్రాక్టర్ యజమానులు భవిష్యత్ ప్రమాదాన్ని పట్టించుకోకుండా అందినప్పుడల్లా అక్రమంగా తరలించుకుని సొమ్ము చేసుకునేందుకు అలవాటు పడ్డారు.

అరికట్టాల్సిన అధికారులు గ్రామం లోని చోటా మోటా నాయకులు తలదూర్చి వారికి అండగా నిలుస్తూ అందినకాడికి దండుకునేందుకు అలవాటు పడ్డట్టు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే వారం రోజుల క్రితం ఇరు గ్రామ పంచాయతీలకు చెందిన పెద్దల సమక్షంలో మానేరులో హద్దులు నిర్ణయించి ఇరు గ్రామాల ట్రాక్టర్ యజమానులు ఎవరి హద్దుల్లో వారు ఇసుకను తరలించుకోవాలి.. ఎవరు హద్దులు దాటిన అందుకు తగువిధంగా ఫెనాల్టీ చెల్లించేందుకు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే గట్టెపల్లి ట్రాక్టర్ యజమానులు హద్దులు దాటారంటూ ట్రాక్టర్లను గ్రామ పంచాయతీకి తరలించడం వివాదస్పదంగా మారింది.

కాసుల వర్షం కురిపిస్తున్న అక్రమ దందా

మానేరు వాగులో అక్రమ ఇసుక దందా అధికారులకు కాసుల వర్షం కురిపిస్తుంది అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరు పంచాయతీలకు చెందిన ఇద్దరు పెద్దలు ఓ పోలీస్ అధికారి సహాయంతో ఇరుగ్రామాల ట్రాక్టర్ యజమానుల సమక్షంలో హద్దులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అయితే అక్రమ దందాను అరికట్టవలసి గ్రామ ప్రజాప్రతినిధులు ఓ పోలీస్ అధికారిని పిలిపించి హద్దులు నిర్ణయించడం పై ఇరు గ్రామాల్లో విమర్శలు వ్యక్తం అవుతుండగా అక్రమ దందాకు అండగా నిలవడం వెనుక ఆంతర్యం ఏమిటి అనే చర్చ జరుగుతుంది. అయితే ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరిస్తున్నాం అంటూ ప్రభుత్వం పలు వేదికలపై స్పష్టం చేస్తుండగా అధికారులు మాత్రం అక్రమ దందాకు అండగా నిలుస్తూ అందినకాడికి దండుకోవడం పై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపి అడ్డుకట్ట వేయాలని వేడుకుంటున్నారు.

Next Story