- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చౌటుప్పల్‌లో గోల్డెన్ ఫారెస్ట్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల దందా!
సుప్రీంకోర్టు పరిధిలోని గోల్డెన్ ఫారెస్ట్ భూముల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు. తప్పుడు పత్రాలతో బ్యాంక్ రుణాలు.. అధికారుల తీరుపై సీఎస్‌కు ఫిర్యాదు.

దిశ,చౌటుప్పల్: గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని తాళ్లసింగారం, లింగోజిగూడెం, పంతంగి,తంగడపల్లి, చౌటుప్పల్ రెవెన్యూ పరిధిలో 1257 ఎకరాల భూములను కొనుగోలు చేసింది. 1998 సంవత్సరంలో వీరు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారంటూ సెబీ సంస్థ వారిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు గోల్డెన్ ఫారెస్ట్ సంస్థలో డబ్బులు డిపాజిట్ చేయడంతో వారంతా ఆయా రాష్ట్రాల కోర్టులను ఆశ్రయించారు. వీరంతా కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ భూములను పరిరక్షించి డిపాజిట్ దారుల డబ్బులు తిరిగి చెల్లించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 2004 సంవత్సరంలో గోల్డెన్ ఫారెస్ట్ కమిటీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని సదరు సంస్థ భూముల అమ్మకాలు,కొనుగోలు చెల్లవని ఎవరైనా గోల్డెన్ ఫారెస్ట్ సంస్థ సభ్యుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన సంస్థకు ఎలాంటి సంబంధం లేదని పత్రికల్లో ప్రకటనలు జారీ చేశారు.
అయినా ఆగని రిజిస్ట్రేషన్లు
సుప్రీంకోర్టు పరిధిలో గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ భూముల వ్యవహారం నడుస్తున్న సదరు సంస్థ కమిటీ పత్రికా ప్రకటన ద్వారా బహిరంగంగా చెప్పిన అవేమీ తమకు పట్టనట్లు అక్రమార్కులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించారు. గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ సంస్థలోని ఓ సభ్యుడు రిజిస్ట్రేషన్ చేసినట్లు పలువురు రిజిస్టర్ డాక్యుమెంట్లతో రెవెన్యూ కార్యాలయాల్లో మ్యుటేషన్ కు అప్లై చేసుకున్నారు. గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ భూములు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నాయని తెలిసినా కూడా అప్పటి రెవెన్యూ అధికారులు పలు ప్రలోభాలకు లొంగి సదరు వ్యక్తులపై మ్యుటేషన్ చేసి రెవెన్యూ రికార్డులలో పొందుపరిచారు. గోల్డెన్ ఫారెస్ట్ సంస్థ నిర్వాహకుల నుంచి సుప్రీంకోర్టు కమిటీ భూములను స్వాధీనం చేసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్ కస్టోడియన్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ కస్టోడియన్ గా ఉన్న భూములనే రెవెన్యూ అధికారులు తప్పుడు డాక్యుమెంట్లతో మ్యుటేషన్ చేయడం చూస్తుంటే సదరు వ్యక్తులపై అధికారులకు ఉన్న ప్రేమ ఏంటో ఇట్లే అర్థమవుతుంది.
తప్పుడు పత్రాలతో బ్యాంక్ రుణాలు!
2010 సంవత్సరంలో గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన భూములలో ఎలాంటి రిజిస్ట్రేషన్ లోను జరప వద్దంటూ అప్పటి జిల్లా కలెక్టర్ ముక్తేశ్వరరావు చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి లేఖ రాశారు. చౌటుప్పల్ మండల పరిధిలో ఉన్న గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ భూముల వివరాలతో సదరు భూములను ఆ లేఖ ద్వారా పీవోపీ జాబితాలో చేర్చారు. అయినా కూడా అక్రమాలకు అలవాటు పడ్డ కొందరు అధికారులు గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ భూములను రిజిస్ట్రేషన్ చేయటంతో సదరు వ్యక్తులు బ్యాంకులలో రుణాలు కూడా పొందినట్లు సమాచారం. తప్పుడు పత్రాలతో బ్యాంకు రుణాలు పొందిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
క్రమణలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు
గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ భూములలో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గోల్డెన్ ఫారెస్ట్ భూముల సర్వే ఇప్పటికే పూర్తి చేసిన అధికారులు ఓ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేశారు. సదరు నివేదికను అధికారులు తప్పుల తడకగా రూపొందించారని స్థానిక మాజీ ప్రజా ప్రతినిధి ఒకరు సిఎస్ కు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టుకు అందచేసిన నివేదికలో గోల్డెన్ ఫారెస్ట్ భూములు కొన్ని ఆక్రమణకు గురైనట్లు వివరాలతో సహా వెల్లడించారు. సదరు ఆక్రమణలను తొలగించాల్సిన రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా సర్వే నిర్వహించి నివేదికను అందజేయడం పట్ల వారికి చేకూరిన లబ్ధి ఏంటో అర్థం కావడం లేదు. ఆక్రమణకు గురైన స్థలాలలో ఎలాంటి ఫెన్సింగ్ వేయకుండా కేవలం సర్వే మ్యాప్ లో చూయించి నివేదిక పంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఓ ఐఏఎస్ స్థాయి అధికారితో నిష్పక్షపాతంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి హద్దురాళ్లను నాటి గోల్డెన్ ఫారెస్ట్ భూములను కాపాడి డిపాజిట్ దారులకు న్యాయం చేకూర్చాలని వేడుకుంటున్నారు.






