- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజూరాబాద్‌లో అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం
పేదలకు చెందాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన ఓ కిరాణా దుకాణంపై పోలీసులు దాడి చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

దిశ, హుజూరాబాద్ రూరల్ : పేదలకు చెందాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన ఓ కిరాణా దుకాణంపై పోలీసులు దాడి చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన హుజూరాబాద్ పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న మార్కెట్ రోడ్డులోని 'క్యాస రమేష్ కిరాణం' దుకాణంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్లు బ్లూకోట్స్ పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. ఆదివారం సెలవు రోజు కావడంతో నిఘా తక్కువగా ఉంటుందనే అంచనాతో అక్రమ నిల్వలకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు పోలీసులు సదరు కిరాణా దుకాణంపై ఆకస్మిక దాడి నిర్వహించారు. తనిఖీల్లో దుకాణంలో దాచి ఉంచిన సుమారు రెండు క్వింటాళ్ల పీడీఎస్ రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
రంగంలోకి ఫుడ్ ఇన్‌స్పెక్టర్..
అనంతరం బ్లూకోట్స్ పోలీసులు హుజూరాబాద్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వినోద్‌కు సమాచారం అందించారు. ఆదివారం సెలవు రోజైనప్పటికీ, సమాచారం అందుకున్న వెంటనే ఆయన ఘటన స్థలానికి చేరుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని పరిశీలించి సీజ్ చేశారు. అనంతరం బియ్యాన్ని భద్రపరిచేందుకు స్థానిక సమీప రేషన్ డీలర్ దుకాణానికి తరలించారు.
కఠిన చర్యలు తప్పవు : అధికారులు
పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకే నిల్వ చేశారా? లేదా? అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. స్వాధీనం చేసుకున్న బియ్యం నమూనాలను తదుపరి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపినట్లు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ప్రయోగశాల నివేదిక ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయించినా, నిల్వ చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.






