- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్కార్ ఖజానాకు వందల కోట్ల గండి.. నిమ్జ్ పేరుతో అక్రమ ప్లాట్ల దందా!
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) రాకను ఆసరాగా చేసుకుని రియల్ మాఫియా పడగ విప్పింది.

దిశ, ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి(నిమ్జ్) రాకను ఆసరాగా చేసుకుని రియల్ మాఫియా పడగ విప్పింది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రాబోయే పారిశ్రామిక విప్లవాన్ని, ఉపాధి అవకాశాలను పెట్టుబడిగా మార్చుకోవాలని చూస్తున్న కొందరు అక్రమ నిర్వాహకులు, నిబంధనలను తుంగలో తొక్కుతూ అక్రమ వెంచర్ల దందాను పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నారు. ముఖ్యంగా న్యాల్‌కల్, ఝరాసంగం మండలాల్లోని పలు గ్రామాల్లో వ్యవసాయ భూములు రాత్రికి రాత్రే ప్లాట్లుగా మారిపోతున్నాయి. ‘నిమ్జ్ సమీపంలో గోల్డెన్ ఛాన్స్’ అంటూ ఆకర్షణీయమైన బ్రోచర్లు, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలతో అమాయక, మధ్యతరగతి ప్రజలను నమ్మించి వందల కోట్ల మోసానికి తెరలేపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిబంధనల ఉల్లంఘన.. డీటీసీపీ, రేరా చట్టాలకు పాతర..
రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, కొనుగోలుదారుల హక్కుల రక్షణ కోసం ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా-2016) చట్టాన్ని తీసుకొచ్చింది. అలాగే, ఏ ప్రాంతంలోనైనా లేఅవుట్ చేయాలంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీ టీ సీ పీ) అనుమతులు తప్పనిసరి. కానీ, జహీరాబాద్ పరిధిలోని అక్రమ వెంచర్లలో ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు.
గ్రామ పంచాయతీ అనుమతుల పేరిట మోసం..
డీటీసీపీ, రేరా రిజిస్ట్రేషన్ లేకుండా ఏ ప్రాజెక్టునూ విక్రయించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ.. కొందరు నిర్వాహకులు కేవలం గ్రామ పంచాయతీ అనుమతులు ఉన్నాయంటూ నకిలీ పత్రాలు చూపిస్తూ ప్లాట్లను విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం వెంచర్ డెవలప్ చేయాలంటే కనీసం 30 లేదా 40 అడుగుల బీటీ/సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, విద్యుత్ లైన్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలి. కానీ, ఇక్కడ కేవలం మట్టి రోడ్లు వేసి, సున్నపు గీతలు గీసి ప్లాట్లను అప్పగిస్తున్నారు.ఝరాసంగం మండల పరిధిలోని బర్దిపూర్, కుప్పానగర్, ఝరాసంగం, బొప్పనపల్లి, చిలేపల్లి, దేవరంపల్లి, ఈదులపల్లి, చిలేమామిడి, సిద్దాపూర్ తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల వ్యవసాయ భూములు అక్రమ వెంచర్లుగా మారిపోయాయి.
ప్రభుత్వ ఆదాయానికి గండి..
ఈ అక్రమ వెంచర్ల దందాలో ప్రభుత్వ ఆదాయానికి వందల కోట్ల గండి పడుతోంది. చట్టప్రకారం వ్యవసాయ భూమిని నివాస స్థలాలుగా(రెసిడెన్షియల్ లేఅవుట్‌గా) మార్చాలంటే, ప్రభుత్వానికి భారీగా ఫీజు చెల్లించి నాలా అనుమతి పొందాలి. ఈ పన్నులు, అభివృద్ధి రుసుము చెల్లించకుండా తప్పించుకోవడానికి నిర్వాహకులు అడ్డదారి తొక్కుతున్నారు. వ్యవసాయ భూమిని వ్యవసాయ భూమిగానే చూపిస్తూ.. ‘గుంటల’ లెక్కన చిన్న ముక్కలుగా విభజించి రిజిస్ట్రేషన్లు కానిచ్చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన రిజిస్ట్రేషన్ ఆదాయం, లేఅవుట్ ఫీజులు పూర్తిగా ఆవిరైపోతున్నాయి. దానికి తోడు అధికారిక లేఅవుట్‌లో మొత్తం భూమిలో నిర్దేశిత శాతాన్ని పార్కులు, కమ్యూనిటీ హాల్స్, సామాజిక అవసరాల కోసం గ్రామ పంచాయతీకి ఉచితంగా బదలాయించాలి. కానీ అక్రమ వెంచర్లలో జీపీకి కేటాయించాల్సిన స్థలాలను సైతం నిర్వాహకులు పక్కదారి పట్టిస్తున్నారు. చూపించడానికి కొంత స్థలం వదిలినా, అక్కడ కనీసం 'ఇది గ్రామ పంచాయతీ స్థలం' అనే గుర్తింపు బోర్డులు కూడా పెట్టడం లేదు. ఈ స్థలాలను కూడా విక్రయించేందుకు ప్లాన్ చేస్తున్న తెలుస్తోంది.
వరద ముప్పు- రహదారుల ధ్వంసం..
ముఖ్యంగా ఝరాసంగం–కుప్పానగర్ మధ్య వెలసిన కొన్ని వెంచర్ల నిర్వాహకులు సహజ నీటి ప్రవాహాలు (వాగులు, వంకలను) పూడ్చివేసి, చుట్టూ ప్రహరీ గోడలు, కంచెలు నిర్మించారు. దీనివల్ల వర్షాకాలంలో వరద నీరు వెళ్లే మార్గం లేక రహదారులపైకి చేరుతోంది. ఫలితంగా కోట్లాది రూపాయలతో నిర్మించిన ప్రధాన రహదారులు ధ్వంసమై రవాణా వ్యవస్థ స్తంభిస్తోంది. ఇంత పెద్ద ఎత్తున అక్రమ దందా సాగుతున్నా.. ఉన్నతాధికారులు మౌనం వహించడం వెనుక పెద్ద కథే ఉందనే విమర్శలు వస్తున్నాయి. కింది స్థాయి విలేజ్ రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు కొందరు రియల్టర్ల నుంచి భారీగా ముడుపులు అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వెంచర్ల ఏర్పాటు సమయంలోనే ఫిర్యాదులు వచ్చినా.. తనిఖీల పేరుతో కాలయాపన చేస్తూ రియల్టర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కొనుగోలుదారులకు అప్రమత్తత అవసరం..
"నిమ్జ్ వస్తోంది.. ఇక్కడ పెట్టుబడి పెడితే కోట్లు వస్తాయి" అనే భ్రమల్లో పడి అమాయక ప్రజలు తమ కష్టార్జితాన్ని ఇలాంటి నకిలీ వెంచర్లలో పెట్టి మోసపోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రేరా రిజిస్ట్రేషన్ నంబర్, డీటీసీపీ లే అవుట్ కాపీ ఉంటేనే ఆ ప్లాట్లు చట్టబద్ధమైనవని, లేదంటే భవిష్యత్తులో ఇళ్లు కట్టుకోవడానికి అనుమతులు రాక, విక్రయించడానికి వీలులేక కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. కొనుగోలుదారులు వెంచర్‌లో ప్లాట్లు కొనే ముందు నిమ్జ్ పరిసర ప్రాంతానికి ఎంత దూరంలో లే ఔట్ ఉందన్న విషయంతో పాటు సదరు లేఔట్ డీటీసీపీ రేరా అప్రూవల్స్‌ను చెక్ చేయాలని సూచిస్తున్నారు. అన్ని అనుమతులు సరిచూసుకొని పెట్టుబడి పెడితేనే భవిష్యత్తుకు భరోసా దొరుకుతుందని తెలిసి చెప్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్న ఈ అక్రమ వెంచర్ల వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి, రెవెన్యూ, పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్, డీటీసీపీ శాఖలతో ఒక టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో ఉమ్మడి తనిఖీలు నిర్వహించి, అనుమతులు లేని అక్రమ వెంచర్ల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ప్రభుత్వ భూములు, జీపీ స్థలాలను డిమాండ్ చేస్తున్నారు.






