- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖాజాగూడ చెరువు బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు
ఐటీ కారిడార్‌కు మణిహారంగా నిలిచిన ఖాజాగూడ చెరువు క్రమంగా తన స్వరూపాన్ని కోల్పోతోంది.

దిశ, శేరిలింగంపల్లి : ఐటీ కారిడార్‌కు మణిహారంగా నిలిచిన ఖాజాగూడ చెరువు క్రమంగా తన స్వరూపాన్ని కోల్పోతోంది. చెరువు దిగువ భాగంలో ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వైపు చెరువు పునరుద్ధరణ కోసం అప్పటి జీహెచ్‌ఎంసీ, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో లేక్‌ఫ్రంట్ అభివృద్ధి పేరుతో నడక మార్గాలు, అలంకార ప్రాయమైన శిల్పాలు, పచ్చదనంతో అభివృద్ధి చేశారు. అయితే, ఎగువ భాగంలో రోడా మేస్త్రి కళాశాల వైపు బఫర్ జోన్‌లోనే అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ అక్రమ నిర్మాణాలకు శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఊతమిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువు బఫర్ జోన్‌లో గతంలో అనధికారికంగా ప్లాట్లు విక్రయించారు. ఆ ప్లాట్లు కొనుగోలు చేసిన వారు జీవో 58 కింద దరఖాస్తులు చేసుకున్నప్పటికీ, బఫర్ జోన్ పరిధిలో ఉండటంతో ఇంతవరకు ఎవరూ నిర్మాణాలు చేపట్టేందుకు సాహసించలేదు.
ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ ప్రాంతమంతా బఫర్ జోన్‌లోనే ఉన్నట్లు నిర్ధారించారు. శాటిలైట్ చిత్రాలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. అయినప్పటికీ, టౌన్ ప్లానింగ్‌లో గతంలో కీలకంగా వ్యవహరించిన ఓ అధికారి ఇరిగేషన్ శాఖ నుంచి ఎన్‌ఓసీ, రెవెన్యూ శాఖ నుంచి క్లియరెన్స్ లేకుండానే ఏకపక్షంగా నిర్మాణ అనుమతులు మంజూరు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారుల తీరును అడ్డుకోవాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు కూడా కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా బఫర్ జోన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి.
అక్కడ ఓ నిర్మాణ దారుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి పేరు కూడా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. పనులు నిలిపివేయడానికి వెళ్లిన చైన్‌మన్‌లను సీఎం కుటుంబానికి సంబంధించిన స్థలమైతే కూడా మాట్లాడతావా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని కింది స్థాయి సిబ్బంది వాపోతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మూడు భవనాలకు జీ ప్లస్ టూ అనుమతులు జారీ చేశారు. అయితే, సెల్లార్‌తో పాటు ఏడు అంతస్తుల భవనాల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
బఫర్ జోన్ పరిధి దాటి ఉన్న ప్లాట్లకు రెవెన్యూ శాఖ నుంచి ఎన్‌ఓసీ జారీ చేసేందుకు సర్వేయర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. రెండు ప్లాట్లకు జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్స్ జారీ చేసినప్పటికీ, స్కెచ్ మ్యాప్ ఇవ్వడానికి నిబంధనల పేరుతో రెవెన్యూ శాఖ అధికారులు నిరాకరించినట్లు సమాచారం. అయితే, బఫర్ జోన్‌లోనే జరుగుతున్న నిర్మాణాల విషయంలో మాత్రం రెవెన్యూ శాఖ అధికారులు స్పందించడం లేదని, ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా నోరు మెదపడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హైకోర్టు ఆదేశాలు పట్టించుకోవడం లేదు..
2023లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల సరస్సుల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఖాజాగూడ చెరువును కూడా అభివృద్ధి చేశారు. మరోవైపు, జరుగుతున్న ఆక్రమణలను మాత్రం నిరోధించడంలో అధికారులు విఫలమయ్యారు. 2014 ఫిబ్రవరి 25న నిర్వహించిన అధికారిక సర్వే ప్రకారం ఖాజాగూడ తలాబ్ మొత్తం విస్తీర్ణం 38.4 ఎకరాలుగా గుర్తించారు. అనంతరం 2019 సెప్టెంబర్ 18న జరిగిన పునఃసర్వేలో అది 37 ఎకరాలకు తగ్గినట్లు తేలింది. ఈ ఒక ఎకరం తేడాపై తెలంగాణ హైకోర్టు హెచ్‌ఎండీఏ, రెవెన్యూ శాఖలను వివరణ కోరినప్పటికీ, ఇప్పటివరకు స్పష్టత రాలేదు. చారిత్రక రికార్డుల ప్రకారం ఈ చెరువు ఒకప్పుడు సుమారు 618 ఎకరాల విస్తీర్ణంలో ఉండి, దాదాపు 900 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించేదని ఆధారాలు చెబుతున్నాయి. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ చెరువును ఒకవైపు లక్షలాది టిప్పర్ల మట్టితో నింపి ఆనవాళ్లు చెరిపి వేశారు.
అంతేకాకుండా, సమీపంలోని అపార్ట్‌మెంట్ల నుంచి వ్యర్థ జలాలను నేరుగా చెరువులోకి విడుదల చేస్తున్నారు. దీంతో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వైపు కోట్ల రూపాయలు వెచ్చించి చేపట్టిన అభివృద్ధి పనుల ప్రయోజనం లేకుండా పోతోంది. సాయంత్రం వేళ సేదతీరేందుకు వచ్చే సందర్శకులు దుర్గంధాన్ని భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. చెరువు వద్దకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.






