- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీఓకేలో ఆందోళనల వెనుక భారత్..? ఆరోపణలపై స్పందించిన కేంద్ర విదేశాంగ శాఖ
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో జరుగుతున్న ప్రజా ఆందోళనల వెనుక భారతదేశ హస్తం ఉందంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన ఆరోపణలను కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో జరుగుతున్న ప్రజా ఆందోళనల వెనుక భారతదేశ హస్తం ఉందంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన ఆరోపణలను కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తన సొంత వైఫల్యాలను, మానవ హక్కుల ఉల్లంఘనలను కప్పిపుచ్చుకోవడానికే పాకిస్తాన్ ఇలాంటి నిరాధారమైన, నీచమైన ఆరోపణలు చేస్తోందని భారత్ మండిపడింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. పాక్ ఆరోపణలు కేవలం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమేనని కొట్టిపారేశారు. పీఓకేలో నెలకొన్న అశాంతికి పాక్ అవలంబిస్తున్న ఆర్థిక దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, పరిపాలనాపరమైన అణచివేతలే ప్రధాన కారణాలని ఆయన స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పౌరులపై పాక్ ప్రభుత్వం ఇంటర్నెట్ నిలిపివేత, అమానుష పోలీసు లాఠీఛార్జీలు, ప్రాణాంతక బలగాల ప్రయోగం వంటి చర్యలకు పాల్పడిందని, ఈ హింసలో పలువురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పాకిస్తాన్ చేస్తున్న ఈ అకృత్యాలపై అంతర్జాతీయ సమాజం ఆ దేశాన్ని నిలదీయాలని జైస్వాల్ డిమాండ్ చేశారు.
ఉద్రిక్తంగా మారిన పీఓకే..
జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. జులై 27న జరగనున్న స్థానిక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పీఓకేలో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరాయి. పాకిస్తాన్ ప్రధాన భూభాగంలో నివసిస్తున్న కాశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించిన 12 రిజర్వుడ్ అసెంబ్లీ స్థానాలను రద్దు చేయాలని స్థానిక ‘జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ (JAAC) డిమాండ్ చేస్తోంది. ఈ స్థానాల ద్వారా స్థానిక ప్రభుత్వంలో పాక్ జోక్యం చేసుకుంటోందని వారు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రావాలాకోట్‌లో జరిగిన ఘర్షణల్లో నలుగురు పోలీసులతో సహా 11 మంది మరణించారు. దీంతో పాక్ ప్రభుత్వం ‘జాక్’ (JAAC) కమిటీపై నిషేధం విధించి, దేశద్రోహం కేసులు నమోదు చేయడమే కాకుండా వందలాది మంది యాక్టివిస్టులను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం పీఓకేలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోగా, బందీలుగా ఉన్న తమ నాయకులను విడుదల చేయాలంటూ ఆందోళనకారులు పాక్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.






