ప్రజా సమస్యలపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలి

by Ratna Kumari |

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి వచ్చిన వినతులు, సమస్యలను సమగ్రంగా విశ్లేషించి వాటి పరిష్కారానికి జిల్లా స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లాకు ప్రత్యేక అధికారిణి డా. క్రిస్టినా జడ్ చోంగ్తు అధికారులను ఆదేశించారు.

ప్రజా సమస్యలపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలి
X

దిశ,సంగారెడ్డి అర్బన్ : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి వచ్చిన వినతులు, సమస్యలను సమగ్రంగా విశ్లేషించి వాటి పరిష్కారానికి జిల్లా స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లాకు ప్రత్యేక అధికారిణి డా. క్రిస్టినా జడ్ చోంగ్తు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, వివిధ శాఖల జిల్లా అధికారులతో ప్రత్యేక అధికారిణి ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక అమలు, పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జిల్లాలో అన్ని శాఖలు సమన్వయంతో, బాధ్యతాయుతంగా అమలు చేసి విజయవంతం చేసినందుకు జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.ప్రగతి ప్రణాళిక సభల సందర్భంగా ప్రజల నుంచి అందిన వినతులు, సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టిన చర్యలు, శాఖల వారీగా థీమ్ ఆధారంగా అమలు చేసిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు చేకూరిన ప్రయోజనాలు, సాధించిన లక్ష్యాలు, ప్రజల స్పందన తదితర అంశాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతుల్లో ఎన్ని పరిష్కరించబడ్డాయి, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి, వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టవచ్చో సమగ్రంగా విశ్లేషించాలని సూచించారు.కార్యక్రమం అమలులో చేపట్టిన వినూత్న కార్యక్రమాలు మంచి ఫలితాలు సాధించి ఉంటే వాటిని జిల్లాలో నిరంతరం కొనసాగించే అవకాశాలు పరిశీలించాలని ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాల చేరువను మెరుగుపరిచిన చర్యలు, ప్రజల నుంచి విశేష ఆదరణ పొందిన కార్యక్రమాలను గుర్తించి భవిష్యత్తులో మరింత విస్తృతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో పనిచేసిన అధికారుల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరించి మరింత మెరుగైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు.ప్రజా పాలన–ప్రగతి కార్యక్రమాల సందర్భంగా వివిధ శాఖలకు ప్రజలు చేసిన విజ్ఞప్తులను అధ్యయనం చేసి, వాటిని శాఖల స్థాయిలోనే పరిష్కరించగలమా, ఇతర శాఖల సమన్వయం అవసరమా లేదా ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేక చర్యలు అవసరమా అనే అంశాలపై దృష్టి సారించి జిల్లా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. ప్రజా పాలన–ప్రగతి కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను మూడు విభాగాలుగా వర్గీకరించామని తెలిపారు. శాఖల అధికారులు గుర్తించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో తీసుకుని పరిష్కరించగల అంశాలపై వెంటనే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడం, మెరుగైన సౌకర్యాలు అందించడం లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తోందని పేర్కొన్నారు.ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి, అన్ని శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Next Story