నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా కృషి చేయాలి : ఐటీడీఏ పీవో మంద మకరంద్

by Batti.Sumithra |

ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా సిబ్బంది కృషి చేయాలని ఐటీడీఏ పీవో మంద మకరంద్ సూచించారు.

నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా కృషి చేయాలి : ఐటీడీఏ పీవో మంద మకరంద్
X

దిశ, ఉట్నూర్ : ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా సిబ్బంది కృషి చేయాలని ఐటీడీఏ పీవో మంద మకరంద్ సూచించారు. మంగళవారం ఐటీడీఏ పీవో మంద మకరంద్ ఉట్నూర్‌లోని ఆశ్రమ పాఠశాల (బాలికలు)ను సందర్శించి పాఠశాల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, వసతి సౌకర్యాలు, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి, ఆ రోజు అమలవుతున్న మెనూ వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి భోజనం నాణ్యత, రుచి, పరిమాణం, ఇతర సౌకర్యాల పై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులు, వసతి గృహాలు, వంటశాల, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించిన పీవో విద్యార్థుల విద్యా నాణ్యతను మరింత మెరుగుపరచడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు అనుసరిస్తున్న విధానాలు, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారాల పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని పీవో సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. వసతి గృహాలు, తరగతి గదులు, ఇతర భవనాల్లో మరమ్మతులు అవసరమైతే వెంటనే చేపట్టి విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల ఆవరణలో ఆకుకూరల నర్సరీని ఏర్పాటు చేసి పోషకాహార అవసరాలకు ఉపయోగపడేలా చూడాలన్నారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నిల్వ నీటి కారణంగా దోమలు వ్యాప్తి చెంది విద్యార్థులకు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పాఠశాల ప్రాంగణంలో నీరు నిల్వ కాకుండా పారిశుద్ధ్య చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం విద్య, ఆరోగ్యం, పోషకాహారం, భద్రత అంశాల్లో రాజీ లేకుండా పనిచేయాలని పీవో స్పష్టం చేశారు. పీవో వెంట సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

Next Story