30 వేల కోట్ల మెట్రో రైల్ ఆస్తులపై సీఎం కన్ను.. కేటీఆర్ తీవ్ర ఆరోపణలు

by Ramesh Naini |

సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇద్దరూ కలిసి హైదరాబాద్ మెట్రో అంశంలో డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

30 వేల కోట్ల మెట్రో రైల్ ఆస్తులపై సీఎం కన్ను.. కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇద్దరూ కలిసి హైదరాబాద్ మెట్రో అంశంలో డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రేవంత్‌ రెడ్డి కేంద్రాన్ని ఏదో అడిగినట్లు.. కేంద్రం నుంచి కిషన్‌రెడ్డి ఏదో తీసుకొచ్చినట్లు ఢిల్లీలో మళ్లీ నాటకాలు మొదలుపెట్టారని అన్నారు. హైదరాబాద్‌లో అడ్డగోలుగా విమర్శలు చేసుకొని, ఢిల్లీలో కలిసినట్లు నాటకాలు ఆడుతూ కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎయిర్ పోర్ట్ మెట్రో రద్దు చేసిన రేవంత్‌ను, మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కిషన్‌రెడ్డిని ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. హైదరాబాద్ మెట్రో పైన ఉన్న 250 ఎకరాల భూములను తన సొంత అన్నదమ్ములకు, బావమరిదికి, కుటుంబ సభ్యులకు కట్టబెట్టేందుకు రేవంత్‌ రెడ్డి కుట్ర చేస్తున్నారన్నారు.

మెట్రో దగ్గర ఉన్న రూ.30 వేల కోట్ల విలువైన ఆస్తులపై కన్నేసి, ఎల్‌అండ్‌టీ అధికారులను బ్లాక్ మెయిల్ చేసి వారిని రాష్ట్రం నుంచి తన్ని తరిమేశారన్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం మెట్రో వేల కోట్ల ఆస్తుల కోసం ప్రైవేట్ సంస్థ అయిన ఎల్‌అండ్‌టీ రూ.14 వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రజల మీద రేవంత్‌రెడ్డి రుద్దుతున్నారన్నారు. మెట్రోపై ప్రేమ ఉన్నట్లు చేస్తున్న సీఎం ప్రయత్నం వెనుక భారీ కుంభకోణం ఉన్నదని ఆరోపించారు. కిషన్‌రెడ్డికి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు చేస్తున్నది డ్రామా కాకుంటే గత ప్రభుత్వం ప్రతిపాదించిన లక్డీకాపూల్ నుంచి మెట్రో పటాన్‌చెరువు వరకు ప్రతిపాదిస్తే ఎందుకు ఆమోదం తెలపలేదన్నారు. అత్యధిక జనసాంద్రత కలిగిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎయిర్ పోర్ట్ వరకు ఎలాంటి భూసేకరణ లేకుండా మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే, రేవంత్‌రెడ్డి దానిని రద్దు చేశారన్నారు. హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రాజెక్టు మరోసారి పట్టాలు ఎక్కాలంటే కచ్చితంగా కేసీఆర్ తిరిగి రావాల్సిందేనని అన్నారు.

మూసీ ప్రాజెక్టు పేరుతో అక్రమాలు

రేవంత్‌రెడ్డికి తుగ్లక్ ఆదర్శం కాబట్టే, అడ్డగోలుగా హైదరాబాద్ నగరంలో లక్షల మంది ఇండ్లను కూలగొట్టి, మూసీ ప్రాజెక్టు పేరుతో అక్రమాలకు తెరలేపారని కేటీఆర్ అన్నారు. లక్షన్నర కోట్లతో మూసీ పనులు చేసేందుకు డబ్బులు ఉంటాయి కానీ, ఇచ్చిన హామీలను అమలు చేయడానికి మాత్రం డబ్బులు ఉండవని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తల కష్టంతో గెలిచిన షేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తన అవినీతి, అక్రమాలను కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌లోకి మారారన్నారు. గతంలో పదేళ్ల బీఆర్ఎస్ కాలంలో ఒక్క షేరిలింగంపల్లి నియోజకవర్గానికి రూ.9,500 కోట్లతో ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులతో ఒక ప్రగతి నివేదికను విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ రెండున్నరేళ్లలో ఎన్ని డబ్బులు నియోజకవర్గానికి తెచ్చారో ఎమ్మెల్యే గాంధీ చెప్పాలన్నారు. షేరిలింగంపల్లిలో మరోసారి గులాబీ జెండా ఎగరాలంటే కార్యకర్తలంతా కలిసికట్టుగా కదంతొక్కాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదుతోపాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్‌పై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ మళ్లీ ఎప్పుడు సీఎం పదవీ బాధ్యతలు స్వీకరిస్తారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.

రైతుల సమస్యలపై పోరాడితే గృహ నిర్బంధాలా?

రైతులకు ఎరువుల సరఫరాలో ఏర్పడిన తీవ్ర సమస్యలను ఎత్తిచూపుతూ, యూరియా పంపిణీలో అమలు చేస్తున్న లోపభూయిష్టమైన యాప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయి మండల కేంద్రంలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమైన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిని గృహ నిర్బంధం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణికి నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. రైతుల తరఫున ప్రశ్నించే నాయకులను అణిచివేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. యాప్‌ల పేరుతో రైతులను క్యూలలో నిలబెట్టి, రోజుల తరబడి ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం, రైతు సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కును కోల్పోయిందన్నారు. గృహ నిర్బంధాలు, అక్రమ ఆంక్షలు, బెదిరింపులతో బీఆర్ఎస్ నాయకులను గానీ, రైతులను గానీ భయపెట్టలేరని హెచ్చరించారు.

Next Story