8 మందిని చంపిన సైకో కిల్లర్.. శవయాత్రలకు హాజరవుతూ డ్రామాలు!

by Thanuru Gopichand |

ఛత్తీస్‌గఢ్‌లోని బలోదాబజార్ జిల్లా ఖర్వే గ్రామంలో ఒక కిరాణా దుకాణదారుడు సృష్టించిన నరమేధం తీవ్ర కలకలం రేపింది.

8 మందిని చంపిన సైకో కిల్లర్.. శవయాత్రలకు హాజరవుతూ డ్రామాలు!
X


దిశ‌, నేష‌న‌ల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లోని బలోదాబజార్ జిల్లా ఖర్వే గ్రామంలో ఒక కిరాణా దుకాణదారుడు సృష్టించిన నరమేధం తీవ్ర కలకలం రేపింది. 46 ఏళ్ల రామ్ సహాయ్ జైస్వాల్ అనే నిందితుడు పాత కక్షలు, చిన్నపాటి వివాదాల నేపథ్యంలో పగ పెంచుకుని, కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఎనిమిది మంది వ్య‌క్తుల‌కు మద్యంలో ప్రాణాంతకమైన బొరాక్స్ పొడి కలిపి ఇచ్చి దారుణంగా హత్య చేశాడు. ఎలుకలను చంపడానికంటూ ఒక గ్రామస్తుడి వద్ద నుండి ఈ పొడిని సేకరించిన నిందితుడు, మొదట దానిని ఒక కుక్కపై ప్రయోగించి చూశాడు. అది చనిపోవడంతో, ఫిబ్రవరి నుండి మే మధ్య కాలంలో తనతో గొడవపడే బద్రి, బుథాలు, ఛత్తూ రామ్, బుధ్‌రామ్, వినోద్ కుమార్, గజానంద్, చైతురామ్ (అప్పు ఎగ్గొట్టేందుకు), మహేతరు రామ్‌లను ఒక్కొక్కరిగా టార్గెట్ చేసి అంతమొందించాడు. తానే ఈ దారుణాలు చేస్తూ.. ఏమీ తెలియనట్లు మృతుల కుటుంబాలకు సాయం చేస్తూ, వారి శవయాత్రలకు కూడా హాజరవుతూ నెలల తరబడి ఎవరికీ అనుమానం రాకుండా జైస్వాల్ డ్రామాలు ఆడాడు.

మొదట్లో ఈ మరణాలన్నీ అనారోగ్యం లేదా సహజ మరణాలుగా గ్రామస్తులు భావించినప్పటికీ, చనిపోయిన వారంతా మరణించడానికి కొద్దిసేపటి ముందే జైస్వాల్‌ను కలిశారని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడి పాపం పండింది. కేసు తీవ్రతను బట్టి రంగంలోకి దిగిన పోలీసులు.. మే 14న మరణించిన చివరి బాధితుడు మహేతరు సాహు మృతదేహాన్ని జూన్ 13న సమాధి నుండి బయటకు తీసి విచారణ ప్రారంభించారు. ఆ తర్వాత మరో ఆరు మృతదేహాలను కూడా తవ్వి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం రాయ్‌పూర్‌లోని డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ మెమోరియల్ ఆసుపత్రికి పంపగా, బుధ్‌రామ్ జైస్వాల్ అనే బాధితుడికి అప్పటికే అంత్యక్రియలు జరిగిపోవడంతో అతడి అవశేషాలను సేకరించడం సాధ్యపడలేదు. స్పెషల్ మెడికో-లీగల్ టీమ్ ఈ శవపరీక్షలను నిర్వహించి, డీఎన్ఏ శాంపిల్స్, ఫోరెన్సిక్ ఆధారాలను భద్రపరచగా.. నిందితుడు ఇచ్చిన విషపూరిత మద్యం తాగి తీవ్ర అస్వస్థతకు గురైన కార్తీక్ అనే వ్యక్తి సకాలంలో ఆసుపత్రికి వెళ్లడం వల్ల ప్రాణాలతో బయటపడి, తనకు జైస్వాలే మద్యం ఇచ్చాడని పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడంతో నిందితుడిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story