- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫైర్ సేఫ్టీ ఫెయిల్.. పబ్‌లు, హాస్టళ్లపై ఫైర్ శాఖ కొరడా!
నగరంలో అగ్నిమాపక నిబంధనలను బేఖాతరు చేస్తున్న వాణిజ్య సముదాయాలు, హాస్టళ్ల పై అగ్నిమాపక శాఖ కొరడా ఝుళిపిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలో అగ్నిమాపక నిబంధనలను బేఖాతరు చేస్తున్న వాణిజ్య సముదాయాలు, హాస్టళ్ల పై అగ్నిమాపక శాఖ కొరడా ఝుళిపిస్తోంది. నిత్యం వందలాది మంది వచ్చి వెళ్లే పబ్‌లు, విద్యార్థులు నివాసం ఉండే పీజీ హాస్టళ్లలో కనీస ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకపోవడంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భద్రత, ప్రాణ రక్షణే ధ్యేయంగా రంగారెడ్డి జిల్లా ఫైర్ ఆఫీసర్-1 డీఎఫ్‌ఓ ఖాజా కరీముల్లా ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మాదాపూర్ 100 ఫీట్ రోడ్డు ఎస్‌బీహెచ్ ఆఫీసర్స్ కాలనీ లోని ఎక్సెల్లో భవనం 7వ అంతస్తులో ఉన్న స్కై 100 కిచెన్ అండ్ బార్ తో పాటు, కొండాపూర్ మార్తాండ నగర్ న్యూ హఫీజ్‌పేట్ లోని వెంకటేశ్వర కో లివింగ్ అండ్ పీజీ హాస్టల్ లో అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లను అధికారుల బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, ప్రమాదం జరిగినప్పుడు సురక్షితంగా బయటకు వెళ్లే మార్గాలు, అగ్నిమాపక పరికరాల పనితీరును అధికారులు అంచనా వేశారు.
నిబంధనల ప్రకారం కఠిన చర్యలు..
అయితే ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. అత్యవసర పరిస్థితుల్లో మంటలను ఆర్పేందుకు అవసరమైన కనీస ఫైర్ సేఫ్టీ పరికరాలు ఆయా ప్రాంగణాల్లో లేవని అధికారులు గుర్తించారు. ప్రాణ రక్షణకు కీలకమైన అగ్నిమాపక ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలపై ఫైర్ సర్వీసెస్ చట్టం నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎఫ్‌ఓ ఖాజా కరీముల్లా హెచ్చరించారు. భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు తక్షణమే తగిన దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, ఫైర్ సేఫ్టీ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆయా భవనాల ప్రతినిధులకు ఆయన స్పష్టం చేశారు.
ఫైర్ సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి..
అగ్ని ప్రమాదాల నివారణ, భద్రతా చర్యలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించేలా, ముందస్తు నివారణ చర్యలు చేపట్టేలా వాణిజ్య సముదాయాలు, రెసిడెన్షియల్ భవనాలు సిద్ధంగా ఉండేలా చూసేందుకు అగ్నిమాపక శాఖ తరచుగా తనిఖీలు, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఆయన వెల్లడించారు. భవన యాజమాన్యాలు, సాధారణ ప్రజలు ప్రాణ రక్షణకు, ఫైర్ సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని.. అగ్నిమాపక భద్రత గల వాతావరణాన్ని నిర్వహించేందుకు తమ శాఖకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.






